Ravindra Jadeja: అసలు మళ్లీ ఆడతానా లేదోనన్న సందేహాలు.. నాకోసం వాళ్లు చాలా కష్టపడ్డారు.. ఆదివారాలు కూడా!

Ravindra Jadeja Laments Missing T20 WC Arey Yaar I Wish I Was There - Sakshi

India Vs Australia - Ravindra Jadeja: ‘‘వరల్డ్‌కప్‌ ఈవెంట్‌.. టీవీలో చూస్తున్నపుడల్లా... ‘‘అరెరె.. నేనూ అక్కడ ఉండి ఉంటే బాగుండేదే’’ అని ఎన్నిసార్లు అనుకున్నానో! ఇలాంటి మరెన్నో ఆలోచనలు నా మదిని చుట్టుముట్టేవి. అవే నన్ను రిహాబ్‌ సెంటర్‌లో కఠినంగా శ్రమించేలా.. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించేలా ముందుకు నడిపాయి’’ అని టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. 

రంజీ ట్రోఫీ ద్వారా మళ్లీ
ఆసియా కప్ టీ20 టోర్నీ-2022 మధ్యలోనే మోకాలి గాయం కారణంగా జడ్డూ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్‌-2022 ఈవెంట్‌లో కూడా పాల్గొనలేకపోయాడు. దీంతో బెంగళూరులోని పునరావాస కేంద్రంలో శిక్షణ పొందిన జడేజా రంజీ ట్రోఫీ టోర్నీ ద్వారా తిరిగి మైదానంలో దిగాడు. 

తమిళనాడుతో మ్యాచ్‌లో సౌరాష్ట్రకు సారథిగా వ్యహరించిన జడ్డూ.. ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న కీలక టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో గాయం కారణంగా తనకు ఎదురైన చేదు అనుభవాలు, పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించడంలో సిబ్బంది తోడ్పడిన విధానం గురించి చెప్పుకొచ్చాడు.


PC: BCCI

ఆదివారం కూడా నాకోసం..
‘బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్న సమయంలో ఫిజియోలు, ట్రెయినర్లు పూర్తిస్థాయిలో నా గాయంపై దృష్టి సారించారు. నాకోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయించారు. ఆదివారం సెలవైనా కూడా నాకోసం ప్రత్యేకంగా వచ్చి నన్ను ట్రెయిన్‌ చేసేవారు. నా కోసం వాళ్లు చాలా కష్టపడ్డారు. సర్జరీ తర్వాత నేనింత త్వరగా కోలుకోవడానికి వాళ్లే కారణం.

కనీస అవసరాలకు కూడా
ఏదేమైనా గాయం తర్వాతి రెండు నెలల కాలం ఎంతో కష్టంగా గడిచింది. నాకు నేనుగా ఎక్కడికి నడిచి వెళ్లే అవకాశం ఉండేది కాదు. కనీస అవసరాల కోసం ఇతరుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి కఠిన దశలో నా కుటుంబం, నా స్నేహితులు పూర్తిగా అండగా నిలబడ్డారు. నిజానికి కోలుకున్న తర్వాత మొదటిసారి గ్రౌండ్‌లో అడుగుపెట్టినపుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

చెన్నైలో మొదటి రోజు కాస్త కష్టంగా
అంతకుముందు దాదాపు ఐదు నెలల పాటు నేను ఇండోర్‌లో జిమ్‌లోనే ఉన్నాను. అసలు నేను కోలుకోగలనా లేదా అన్న సందేహాలు కలిగాయి. 90 గంటల పాటు మ్యాచ్‌లో గడపగలనా అని భయపడ్డాను. ఏదైమైనా చెన్నైలో రంజీ మ్యాచ్‌ మొదటి రోజు కాస్త కష్టంగానే తోచింది. వేడిమిని తట్టుకోలేకపోయాను’’ అని జడ్డూ పేర్కొన్నాడు. తిరిగి భారత్‌ తరఫున బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఆసీస్‌తో సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ కీలకం కానున్నారు.

చదవండి: Ind Vs Aus: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు.. వైట్‌వాష్‌ ఎన్నిసార్లంటే!
ఉమ్రాన్‌ మాలిక్‌ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా? నీకు అంత సీన్‌ లేదులే..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top