Ravichandran Ashwin: గడ్డు పరిస్థితులు.. అప్పుడే రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్నా.. అశ్విన్ భావోద్వేగం

Ravichandran Ashwin Emotional Comments: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన విషయాలు వెల్లడించాడు. చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచన వచ్చిందని.. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారన్నాడు. 2018-2020 మధ్య కాలంలో అశూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. గాయాల బెడద.. వన్డేలు, టీ20లలో చోటు దక్కక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ విషయాల గురించి తాజాగా అశ్విన్ మాట్లాడాడు.
‘‘కారణాలెన్నో... రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాను. నా పట్ల.. నా గాయాల పట్ల చాలా మంది కఠినంగా వ్యవహరించినట్లు అనిపించేది. నన్ను సపోర్టు చేసేవాళ్లు ఎందుకు లేరు? జట్టుకు ఎన్నో విజయాలు అందించాను కదా! అయినా నాకే ఎందుకిలా? నిజానికి ఎదుటి వ్యక్తి సాయం ఆశించే వ్యక్తిని కాను నేను. కానీ... నా బాధను సహానుభూతి చెందేవాళ్లు ఉంటే ఎంతో బాగుంటుంది కదా! నా బాధను పంచుకునే క్రమంలో నేను తలవాల్చడానికి ఒక భుజం ఉంటే ఎంతో బాగుండు అనిపించేది.
2018 ఇంగ్లండ్ సిరీస్.. సౌతాంప్టన్ టెస్టు తర్వాత.. మళ్లీ ఆస్ట్రేలియాలో అడిలైడ్ టెస్టు... గడ్డు పరిస్థితులు. అలాంటి సమయంలో నా భార్య నాకు మద్దతుగా నిలబడింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తప్పక పునరాగమనం చేస్తావంటూ మా నాన్న ప్రోత్సహించారు. తాను చనిపోయేలోపు ఈ ఒక్క కోరిక నెరవేరుతుందని చెప్పారు. అంత నమ్మకం ఆయనకు’’అని అశ్విన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీతో పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు అశూ. అదే విధంగా స్వదేశంలో ఇటీవల ముగిసన న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరుదైన రికార్డులు నమోదు చేశాడు.
చదవండి: Ashes Series 3rd Test: ఆసీస్ యూటర్న్...15 కాదు.. 16.. స్కాట్ బోలాండ్ ఎంట్రీ!