రాయల్స్‌ రాజసం | Rajasthan Royals defeated Chennai Super Kings by 8 wickets | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ రాజసం

Mar 31 2026 5:15 AM | Updated on Mar 31 2026 5:56 AM

Rajasthan Royals defeated Chennai Super Kings by 8 wickets

రాజస్తాన్‌ భారీ విజయం 

12.1 ఓవర్లలో 128 పరుగుల లక్ష్య ఛేదన 

8 వికెట్లతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిత్తు  

ఐపీఎల్‌లో గత ఏడాది రాజస్తాన్, చెన్నై జట్లు చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. తాజా సీజన్‌లో పలు మార్పులతో కొత్తగా మొదలు పెట్టేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ పోరులో చివరకు రాజస్తాన్‌దే పైచేయి అయింది.  బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెన్నైని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రాయల్స్‌ ఆ తర్వాత మరో 47 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.  15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ 15  బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది  మరో సీజన్‌ను ఘనంగా మొదలు పెట్టడం విశేషం.  

గువాహటి: ఐపీఎల్‌లో రెండు భారీ స్కోర్ల మ్యాచ్‌ల తర్వాత మూడో మ్యాచ్‌లో బౌలర్ల ప్రభావం కనిపించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన టీమ్‌ ఒకదశలో 82/8 వద్ద నిలిచింది. 

అయితే జేమీ ఒవర్టన్‌ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్‌) జట్టు స్కోరును 100 దాటించాడు. అనంతరం రాజస్తాన్‌ 12.1 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు చేసి గెలిచింది. వైభవ్‌ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో రాయల్స్‌ గెలుపు లాంఛనంగా మారిపోయింది. యశస్వి జైస్వాల్‌ (36 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  రెండు కీలక వికెట్లు తీసిన బర్గర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

వరల్డ్‌ కప్‌ స్టార్లు విఫలం... 
భారత్‌కు టి20 ప్రపంచ కప్‌ అందించిన జోష్‌లో ఉన్న సంజు సామ్సన్‌కు ఐపీఎల్‌ కొత్త జట్టుతో సరైన ఆరంభం లభించలేదు. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన సామ్సన్‌ ఇప్పుడు తొలిసారి చెన్నై తరఫున తన పాత జట్టుపై ప్రత్యరి్థగా బరిలోకి దిగాడు. అయితే బర్గర్‌ అద్భుత బంతికి సామ్సన్‌ (6) బౌల్డ్‌ కాగా, మరో వరల్డ్‌ కప్‌ విజేత శివమ్‌ దూబే (6) ఆట ఒక సిక్స్‌కే ముగిసింది. ఈ ఏడాది భారత్‌కు కెప్టెన్‌గా అండర్‌–19 వరల్డ్‌ కప్‌ అందించిన ఆయుశ్‌ మాత్రే (0) తొలి బంతికే అవుటయ్యాడు. గత రెండు సీజన్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాని సర్ఫరాజ్‌ ఖాన్‌ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇప్పుడు బరిలోకి దిగినా  అంతగా ఆకట్టుకోలేకపోయాడు.  

కార్తీక్‌ శర్మ అరంగేట్రం... 
ఐపీఎల్‌ వేలంలో రూ.14.20 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టినీ ఆకర్షించిన 20 ఏళ్ల కార్తీక్‌ శర్మకు చెన్నై తొలి మ్యాచ్‌లో అవకాశం కలి్పంచింది. అయితే కార్తీక్‌ (15 బంతుల్లో 18; 1 సిక్స్‌) కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. చెన్నై టీమ్‌లోనే ఉన్న మరో రూ.14.20 కోట్ల ప్లేయర్‌ ప్రశాంత్‌ వీర్‌కు మ్యాచ్‌ చాన్స్‌ లభించలేదు. మరోవైపు బెంగాల్‌ ప్రొ టి20 లీగ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన పేసర్‌ బ్రిజేశ్‌ శర్మతో రాజస్తాన్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయించింది. ఏ స్థాయిలోనైనా ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అతనికి ఇదే తొలి మ్యాచ్‌.  

277 మ్యాచ్‌ల అనంతరం... 
చెన్నై జట్టుకు కర్త, కర్మ, క్రియవంటి ధోని మాత్రమే కాకుండా సురేశ్‌ రైనాకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోని, రైనాలు రామలక్ష్మణుల్లా సుదీర్ఘ కాలం ఆ జట్టును నడిపించారు. అయితే  ధోని, రైనాలలో ఏ ఒక్కరు కూడా తుది జట్టులో లేకుండా 277 మ్యాచ్‌ల తర్వాత చెన్నై టీమ్‌ బరిలోకి దిగడం (చాంపియన్స్‌ లీగ్‌తో కలిపి) విశేషం. 

వైభవ్‌ సూపర్‌... 
తనపై ఉన్న అంచనాలను అందుకుంటూ వైభవ్‌ సూర్యవంశీ మళ్లీ చెలరేగిపోయాడు. ‘సున్నా’ వద్ద కార్తీక్‌ కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. కంబోజ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన వైభవ్‌... నూర్‌ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్స్‌లతో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  

6158 రోజుల తర్వాత... 
భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 17 ఏళ్ల తర్వాత తన మొదటి ఐపీఎల్‌ జట్టు రాజస్తాన్‌ తరఫున మ్యాచ్‌ ఆడాడు. 2008లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి 20 మే, 2009న చివరిసారిగా ఆ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. 6158 రోజుల తర్వాత అతను మళ్లీ రాజస్తాన్‌కు ఆడటం విశేషం. ఈ మధ్య కాలంలో అతను కొచ్చి తరఫున ఒక సీజన్, గుజరాత్‌ లయన్స్‌ తరఫున రెండు సీజన్లు, చెన్నై తరఫున 12 సీజన్ల పాటు ఆడాడు.

స్కోరు వివరాలు  
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (బి) బర్గర్‌ 6; రుతురాజ్‌ (బి) ఆర్చర్‌ 6; మాత్రే (సి) జురేల్‌ (బి) బర్గర్‌ 0; షార్ట్‌ (సి) జైస్వాల్‌ (బి) సందీప్‌ 2; సర్ఫరాజ్‌ (ఎల్బీ) (బి) జడేజా 17; కార్తీక్‌ (ఎల్బీ) (బి) బ్రిజేశ్‌ 18; దూబే (సి) బిష్ణోయ్‌ (బి) జడేజా 6; ఒవర్టన్‌ (రనౌట్‌) 43; నూర్‌ (సి) జురేల్‌ (బి) ఆర్చర్‌ 1; హెన్రీ (సి అండ్‌ బి) బిష్ణోయ్‌ 5; కంబోజ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 127.  
వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–38, 5–51, 6–57, 7–74, 8–82, 9–94, 10–127. 
బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–19–2, బర్గర్‌ 4–0–26–2, బ్రిజేశ్‌ 3–0–17–1, సందీప్‌ 2.4–0–22–1, రవి బిష్ణోయ్‌ 3–0–16–1, జడేజా 3–0–18–2.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 38; వైభవ్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) కంబోజ్‌ 52; జురేల్‌ (బి) కంబోజ్‌ 18; పరాగ్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.1 ఓవర్లలో 2 వికెట్లకు) 128. 
వికెట్ల పతనం: 1–75, 2–99. 
బౌలింగ్‌: హెన్రీ 3–0–40–0, ఖలీల్‌ 3–0–17–0, కంబోజ్‌ 3–0–27–2, నూర్‌ 2–0–24–0, ఒవర్టన్‌ 1–0–14–0, షార్ట్‌ 0.1–0–1–0.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 254 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కేవలం 12 సార్లు మాత్రమే ఆలౌటైంది. ముంబై ఇండియన్స్‌ అత్యధికంగా 5 సార్లు చెన్నైను (2012, 2013, 2015, 2019, 2022లో) ఆలౌట్‌ చేయగా... రాజస్తాన్‌ రాయల్స్‌ (2008, 2026లో), పంజాబ్‌ కింగ్స్‌ (2022, 2025లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ (2009లో), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (2009లో), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2025లో) ఒక్కోసారి చెన్నైను ఆలౌట్‌ చేశాయి.

ఆరు ఐపీఎల్‌ సీజన్‌ల తర్వాత  (2020లో 74; 2021లో 119; 2022లో 55; 2023లో 55; 2024లో 82 నాటౌట్‌; 2025లో 66) సంజూ సామ్సన్‌ తన ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో రెండంకెల స్కోరు చేయకుండా సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement