రాయల్స్‌ నిరీక్షణ ముగిసేనా! | Rajasthan Royals aim for second title | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ నిరీక్షణ ముగిసేనా!

Mar 22 2026 3:45 AM | Updated on Mar 22 2026 3:45 AM

Rajasthan Royals aim for second title

రెండో టైటిల్‌పై రాజస్తాన్‌ గురి

2008 తర్వాత మళ్లీ దక్కని ట్రోఫీ

రియాన్‌ పరాగ్‌కు పగ్గాలు

జడేజా, జైస్వాల్, వైభవ్‌ సూర్యవంశీపై ఆశలు  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆరంభ సీజన్‌ (2008)లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... సంచలన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌... రెండో టైటిల్‌ కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది. ప్లేయర్లు మారినా, సారథులు మారినా జట్టు తలరాత మాత్రం మారడం లేదు. 

ఈ సీజన్‌కు ముందు 11 ఏళ్లు జట్టుతో ఉన్న కెప్టెన్ సంజూ సామ్సన్‌ను వదిలేసుకొని వార్తల్లో నిలిచిన రాజస్తాన్‌... రియాన్‌ పరాగ్‌ సారథ్యంలో కొత్త సీజన్‌కు ‘సై’ అంటోంది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ దూకుడు... యశస్వి జైస్వాల్‌ నిలకడ... హెట్‌మైర్‌ మెరుపులు... రవీంద్ర జడేజా ప్రవేశం... రాయల్స్‌కు రెండో కప్‌ అందిస్తుందా లేదా వేచి చూడాలి!   – సాక్షి క్రీడా విభాగం

ప్రధాన ఆటగాళ్లను తిరిగి తీసుకోకుండా గతేడాది పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌... ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బదిలీ చేసుకొని... అతడి స్థానంలో రవీంద్ర జడేజాను తెచ్చుకుంది. గత సీజన్‌లో కొన్ని కారణాల వల్ల సామ్సన్‌ కొన్ని మ్యాచ్‌ల్లో కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి  దిగగా... అతడి స్థానంలో జట్టుకు నాయకత్వం వహించిన రియాన్‌ పరాగ్‌కు ఈసారి పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు అప్పగించింది. 

పెద్దగా అంతర్జాతీయ స్టార్‌లు లేని జట్టును అతడు ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది. రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కుమార సంగక్కర జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఒకవైపు జట్టును అమ్మేందుకు ఫ్రాంచైజీ ప్రయతి్నస్తుంటే... మైదానంలో మెరుగైన ప్రదర్శనతో ఇతరత్రా వార్తల నుంచి దృష్టి మరల్చాలని టీమ్‌ భావిస్తోంది.  

వైభవ్‌పైనే అందరి దృష్టి... 
పద్నాలుగేళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ... గత సీజన్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్‌ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు 15వ పడిలో అడుగు పెట్టనున్న ఈ పాలబుగ్గల బుడ్డోడు... ఈ ఏడాది ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరం. ఐపీఎల్‌లో రాణించిన అనంతరం దేశవాళీలో, ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో సైతం అదే దూకుడు కొనసాగిస్తూ ఆకట్టుకున్న సూర్యవంశీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. 

బౌలర్‌తో సంబంధం లేకుండా తొలి బంతి నుంచే దంచికొట్టే వైభవ్‌ అదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అతడితో పాటు యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. భారత టి20 జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న జైస్వాల్‌కు ఈ సీజన్‌ మరింత కీలకం కానుంది. వీరిద్దరితో పాటు రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురెల్‌ కీలకం కానున్నారు. 

విదేశీ ఆటగాళ్ల కోటాలో... విండీస్‌ విధ్వంసక వీరుడు హెట్‌మైర్, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్, జోఫ్రా ఆర్చర్, ప్రిటోరియస్, ఫెరీరా, ఎంఫకా, ఆడమ్‌ మిల్నే, బర్గర్‌ అందుబాటులో ఉన్నారు. గతంలో పంజాబ్, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్యామ్‌ కరన్‌ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు అందుబాటులో లేకుంటే ఫ్రాంచైజీ వద్ద తగిన ప్రత్యామ్నాయాలు కూడా లేవు. రవీంద్ర జడేజా తప్ప చెప్పుకోదగ్గ ఆల్‌రౌండర్‌ లేకపోవడం కాస్త ఇబ్బందే అయినా... సమష్టితత్వంతో ఫలితాలు సాధించాలని రాయల్స్‌ యోచిస్తోంది. 

గెలిపించేది ఎవరో? 
ప్రత్యర్థి జట్లన్నీ స్టార్‌ ఆటగాళ్లపై ఆధారపడుతుంటే... రాయల్స్‌ మాత్రం మ్యాచ్‌లు గెలిపించే ఆటగాడి కోసం చూస్తోంది. ముఖ్యంగా 12 మంది బౌలర్లు అందుబాటులో ఉన్నా... వారిలో మ్యాచ్‌ విన్నర్‌లు కనిపించడం లేదు. ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే ఏమాత్రం సహకరిస్తారో చూడాలి. ఐపీఎల్‌లో అపార అనుభవం ఉన్న సందీప్‌ శర్మ రాణించాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. 

రవీంద్ర జడేజాతో పాటు రవి బిష్ణోయ్‌ స్పిన్‌ భారం మోయనున్నారు. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంతో పాటు... గువాహటిలోనూ రాయల్స్‌ తమ సొంతగడ్డ మ్యాచ్‌లు ఆడనుంది. తుది జట్టు ఎంపిక నుంచి ... జట్టులో సమష్టితత్వం వరకు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న రాజస్తాన్‌... మైదానంలో దుమ్మురేపి వాటన్నిటిని అధిగమించాలని ఆశిస్తోంది. ఇదే జరగాలంటే ఎవరో ఒకరు జట్టును గెలిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. 

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు: పరాగ్‌ (కెప్టెన్‌), శుభమ్‌ దూబే, వైభవ్, ఫెరీరా, ప్రిటోరియస్, రవి సింగ్, అమన్‌ రావు, హెట్‌మైర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురేల్, యుధ్‌వీర్, జడేజా, స్యామ్‌ కరన్, ఆర్చర్, తుషార్, ఎంఫకా, రవి బిష్ణోయ్, సుశాంత్‌ మిశ్రా, యశ్‌ రాజ్, విఘ్నేశ్‌ పుతుర్, బ్రిజేశ్‌ శర్మ, మిల్నే, కుల్‌దీప్‌ సేన్, సందీప్‌ శర్మ, బర్గర్‌.

రాజస్తాన్‌ రాయల్స్‌ గణాంకాలు
ఆడిన మ్యాచ్‌లు    236 
గెలిచినవి     116 
ఓడినవి    117 
రద్దు    3 
అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్‌ (2008), రన్నరప్‌ (2022).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement