వాంటా (ఫిన్‌లాండ్): ఆర్క్‌టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–15, 21–15తో రికో గుంజీ (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్, టాప్ సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది.
రచనోక్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 4–10తో వెనుకడి ఉంది. చివరిసారి వీరిద్దరు 2022లో ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో తలపడ్డారు. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ సెమీఫైనల్లో ఆఖరిసారి రచనోక్‌పై సింధు గెలిచింది. ఆ తర్వాత రచనోక్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సింధు ఓడిపోయింది. మరోవైపు తన్వీ శర్మ, తరుణ్ మన్నేపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. ప్రపంచ రెండో ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో తరుణ్ 14–21, 19–21తో... తన్వీ శర్మ 18–21, 7–21తో రచనోక్ చేతిలో ఓటమి పాలయ్యారు.


