ఐర్లాండ్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐరీష్ జట్టు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్టిర్లింగ్ ప్రకటించాడు. జట్టు దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనప్పటికి వన్డేల్లో మాత్రం సారథిగా స్టిర్లింగ్ కొనసాగనున్నాడు.
అతడు చివరగా టీ20 ప్రపంచకప్-2026లో ఐరీష్ జట్టును నడిపించాడు. 35 ఏళ్ల స్టిర్లింగ్ ఈ మెగా టోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురైన స్టిర్లింగ్.. టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
ఇప్పుడు టక్కర్ లేదా హ్యారీ టెక్టర్ ఐర్లాండ్ టీ20 జట్టు బాధ్యతలను చేపట్టే అవకాశముంది. కాగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కేవలం ఒకే ఒక్క విజయం సాధించి టోర్నీని ముగించింది. స్టిర్లింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నప్పటికి ఐర్లాండ్ టీ20 జట్టులో సభ్యునిగా మాత్రం కొనసాగనున్నాడు.
"టీ20 ఫార్మాట్‌లో ఐర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించడం నాకెంతో గర్వకారణం. నాపై నమ్మకం ఉంచిన క్రికెట్ ఐర్లాండ్ మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. కెప్టెన్సీ వదిలినా, ఒక ఆటగాడిగా జట్టుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది" అని స్టిర్లింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్


