Asia Cup 2022: 'నీ కీపింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్‌ బెటర్‌'

Pant misses direct hit in final over; fans write miss you MS Dhoni on Twitter - Sakshi

ఆసియాకప్‌-2022లో టీమిండియా పోరాటం‍ దాదాపు ముగిసింది. సూపర్‌-4లో భాగంగా దుబాయ్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా భారత్‌ ఫైనల్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(72) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్‌ యాదవ్‌(34) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, షనక, కరుణరత్నే చెరో రెండు వికెట్లు సాధించారు.

అదరగొట్టిన శ్రీలంక ఓపెనర్లు
ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మెండిస్‌, నిసంకా అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన యజువేంద్ర చాహల్‌ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను మళ్లీ తిరిగి మళ్లీ పోటీలో నిలబెట్టాడు.

అతడితో పాటు మరో స్పిన్నర్‌ అశ్విన్‌ 14 ఓవర్‌లో  కీలకమైన గుణతిలక వికెట్‌ పడగొట్టాడు. అదే విధంగా 15 ఓవర్‌ తొలి బంతికే మంచి ఊపు మీద ఉన్న కుశాల్‌ మెండిస్‌ను చాహల్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులో ఇద్దరు కొత్త బ్యాటర్లు ఉండడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మలుపు తిరిగేలా కనిపించింది. ఇక 16 ఓవర్‌తో స్పిన్నర్ల నాలుగు ఓవర్ల కోటా పూర్తి అయిపోయింది.

విఫలమైన భారత పేసర్లు
ఈ క్రమంలో అఖరి నాలుగు ఓవర్లలో లంక విజయానికి 42 పరుగులు అవసరమయ్యాయి. 17 ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ 9 పరుగులు ఇవ్వగా.. 18 ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా 12 పరుగులు ఇచ్చాడు . ఇక అఖరి రెండు ఓవర్లలో లంక విజయానికి 12 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చేతికి బంతి అందించాడు. అయితే 19 ఓవర్‌ వేసిన భువీ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా సమీకరణాలు మారిపోయాయి.

అఖరిలో అర్ష్‌దీప్‌ అదుర్స్‌
అఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ వేయడానిక వచ్చాడు. తొలి నాలుగు బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చి అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అఖరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్‌ వేసిన ఐదో బంతిని షనక మిస్‌ చేసుకున్నాడు. దీంతో బంతి నేరుగా వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతికి వెళ్లింది.

గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసిన పంత్‌
ఈ క్రమంలో షనక బై రన్‌కు ప్రయత్నించడంతో.. పంత్‌ వికెట్లకు త్రో చేశాడు. అయితే బంతి వికెట్లకు తాకకుండా బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ చేతికి వెళ్లింది. అర్ష్‌దీప్‌ కూడా నాన్‌స్ట్రైక్‌ వైపు త్రో చేశాడు. అప్పడు కూడా బంతి వికెట్లకు తగలకుండా లాంగ్‌ అన్‌ వైపు వెళ్లింది.

ఈ క్రమంలో బైస్ రూపంలో రెండు పరుగులను లంక బ్యాటర్లు పూర్తి చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లంక లక్ష్యాన్ని చేధించింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(52), కుశాల్‌ మెండిస్‌(57) పరుగులతో రాణించగా.. అఖరిలో కెప్టెన్‌ 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కార్తీక్‌ జట్టులోఉండాల్సింది!
అయితే ఈ మ్యాచ్‌లో కార్తీక్‌ను కాదని పంత్‌ను ఆడించడంపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కీలకమైన సమయంలో షనక స్టంపింగ్‌ ఛాన్స్‌ను కూడా  పంత్‌  మిస్‌ చేశాడు. అదే విధంగా అఖరి ఓవర్‌లో రనౌట్‌ అవకాశాన్ని కూడా మిస్‌ చేసిన పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

కొంచెం ముందుకు వెళ్లి త్రో చేయాల్సిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ఈ సమయంలో ధోనిని గుర్తు చేసుకుంటారు. కాగా 2016 టీ20 ప్రపంచకప్ ఓ మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ విజయానికి అఖరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో.. పాండ్యా వేసిన బంతిని బ్యాటర్‌ మిస్‌ చేసుకున్నాడు. అయితే బంతి నేరుగా వికెట్‌ కీపర్‌ ధోని చేతికి వెళ్లింది.

వెంటనే ధోని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. దీంతో భారత్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా అభిమానులు ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. 'మిస్‌ యూ' ధోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా కార్తీక్‌ జట్టులో ఉండి ఉంటే బాగండేది అని వాపోతున్నారు. బ్యాటింగ్‌లో కూడా పంత్‌ విఫలమయ్యాడు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'నీ కీపింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్‌ బెటర్‌' అంటూ కామెంట్‌ చేశాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Asia Cup 2022: రోహిత్‌ సిక్సర్‌; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top