సోదరి మరణ వార్త విని తల్లడిల్లిపోయిన భారత ఒలింపియన్‌

Olympian Dhanalakshmi Sekar Breaks Down After Knowing About Her Sisters Death - Sakshi

సాక్షి, చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తమిళనాడు మహిళా స్ప్రింటర్‌ ధనలక్షి శేఖర్‌.. తన సోదరి మరణ వార్త తెలిసి తల్లడిల్లిపోయింది. విశ్వక్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి స్వస్థలమైన తిరుచ్చి గుండురుకు ఆదివారం తిరిగొచ్చిన ధనలక్ష్మి.. తన ప్రాణానికి ప్రాణమైన  అక్క గాయత్రి లేదని తెలిసి బోరున విలపించింది. ధనలక్ష్మి టోక్యోలో ఉండగానే ఆమె సోదరి గుండెపోటుతో మరణించింది. 

అయితే ధనలక్ష్మి ఎక్కడ డిస్టర్భ్‌ అవుతుందోనని ఆందోళన చెందిన తల్లి ఉష.. ఆమెకు ఈ వార్తను తెలియనివ్వలేదు. ఒలింపిక్స్‌లో పాల్గొని స్వస్థలానికి తిరిగొచ్చిన సందర్భంగా అక్క రాలేదని ధనలక్ష్మి ఆరా తీయగా.. తల్లి చెప్పిన సమాధానం విని ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించింది. చదువుల పరంగానే కాకుండా క్రీడా పరంగా కూడా అక్క తనను చాలా ప్రోత్సహించిందని కన్నీటి పర్యంతం అయ్యింది. కాగా, ధనలక్ష్మి.. టోక్యోకు వెళ్లిన 400మీ మిక్స్‌డ్‌ రిలే బృందంలో రిజర్వ్ సభ్యురాలిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని స్వస్థలానికి తిరిగొచ్చిన తమిళ క్రీడాకారులకు అభిమానులు, కుటుంబ సభ్యులు సాదర ఆహ్వానం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌కు రాష్ట్రానికి చెందిన 10 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. అందులో ఐదుగురు అథ్లెటిక్స్‌ విభాగంలో ఎంపికయ్యారు. వీరంతా తమ శక్తి మేరకు సత్తా చాటినా పతకం మాత్రం దక్కలేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top