జొకోవిచ్‌ ‘నంబర్‌వన్‌’ రికార్డు | Novak Djokovic Breaks Record for Most Weeks Ranked No. 1 | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ ‘నంబర్‌వన్‌’ రికార్డు

Feb 28 2023 4:42 AM | Updated on Feb 28 2023 4:42 AM

Novak Djokovic Breaks Record for Most Weeks Ranked No. 1 - Sakshi

దుబాయ్‌: టెన్నిస్‌ చరిత్రలో ఏ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ సొంతం చేసుకున్నాడు. 1973 నుంచి టెన్నిస్‌లో కంప్యూటర్‌ ర్యాంకింగ్స్‌ మొదలయ్యాక అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ 6,980 పాయింట్లతో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ సెర్బియా స్టార్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది.

ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్‌ స్టెఫీ గ్రాఫ్‌ పేరిట ఉంది. గ్రాఫ్‌ 377 వారాలు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే జొకోవిచ్‌ గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండ్‌ మేటి రోజర్‌ ఫెడరర్‌ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు. తాజాగా అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా ఈ సెర్బియా యోధుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

‘మీరందరి ప్రేమాభిమానం కారణంగా నా కెరీర్‌లో ఎన్నో కొత్త ఘనతలు సాధించాను. తాజాగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని దుబాయ్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35 ఏళ్ల జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ 2011 జూలై 4న 24 ఏళ్ల 43 రోజుల ప్రాయంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన 28 ప్లేయర్లలో ఒకడైన జొకోవిచ్‌ రికార్డుస్థాయిలో ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించాడు.  

అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్‌–5 ప్లేయర్లు
1. జొకోవిచ్‌:                    378 వారాలు
2. స్టెఫీ గ్రాఫ్‌     :              377 వారాలు
3. మార్టినా నవ్రతిలోవా :    332 వారాలు
4. సెరెనా విలియమ్స్‌:       319 వారాలు
5. రోజర్‌ ఫెడరర్‌   :          310 వారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement