WTC Final: భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు..

Not Taking Bhuvneshwar Kumar To England Is A Huge Mistake Says Sarandeep Singh - Sakshi

న్యూఢిల్లీ: భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి అనుభవజ్ఞుడైన స్వింగ్‌ బౌలర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం టీమిండియా యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటని భారత మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని విశ్లేషిస్తూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించాడు. భారత జట్టులో అత్యుత్తమ స్వింగ్‌ బౌలరైన భువీని ఇంగ్లండ్‌ పర్యటన నిమిత్తం పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు టీమిండియా ప్రకటించిన 15 మంది జాబితాలో శార్ధూల్‌ ఠాకూర్‌ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించాడు. అలాగే, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌పై అతిగా ఆధారపడటాన్ని ఆయన తప్పుపట్టాడు. గత కొంత కాలంగా హార్ధిక్‌ బౌలింగ్‌ చేయకపోవడాన్ని ఉదహరించాడు. ఈ క్రమంలో శార్ధూల్‌, విజయ్‌శంకర్‌, శివమ్‌ దూబేలలో ఒకరిని ప్రోత్సహించాలని ఆయన సూచించాడు. 

ప్రస్తుత జట్టులో యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బాగా బౌలింగ్‌ చేస్తున్నాడని, రాబోయే ఇంగ్లండ్‌ సిరీస్‌లో అతనికి వీలైనన్ని ఎక్కవ అవకాశాలు కల్పించాలని ఈ మాజీ సెలెక్టర్‌ సూచించారు.  ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా రొటేషన్‌ పద్ధతి పాటించి, ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయడ్డాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా పరిస్థితులను బట్టి అదనపు పేసర్‌ను కూడా తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా బ్యాటింగ్‌లో లోపాలను కూడా ఎత్తి చూపాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తన స్థాయి మేరకు రాణించలేకపోతున్నాడని, అతను అతిగా ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిపాడు. పుజారా, రహానే లాంటి సీనియర్‌ ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నారని, వారు పరిస్థితులకు తగ్గట్టు మారాలని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్‌లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలని తెలిపాడు. మొత్తంగా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా బాగానే ఆడుతున్నా, ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. 
చదవండి: WTC Final: పాస్‌ పోర్టులు లాక్కొని మరీ గద కోసం ఆరా తీశారు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top