హెన్రీ 15–7–23–7 

New Zealand VS South Africa 1st Test: Matt Henry Takes Career Best 7/23 - Sakshi

హడలెత్తించిన కివీస్‌ పేసర్‌

దక్షిణాఫ్రికా 95 ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు  

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పేస్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ (7/23) అద్భుత ప్రదర్శనతో చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. జుబేర్‌ హమ్జా (25) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత్‌పై సిరీస్‌ గెలిచి జోరు మీదున్న సఫారీలు 49.2 ఓవర్లలోనే తలవంచారు. ఎల్గర్‌ (1), మార్క్‌రమ్‌ (15), వాన్‌ డర్‌ డసెన్‌ (8), బవుమా (7) విఫలం కావడంతో టీమ్‌ చేతులెత్తేసింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సందర్భంలో 1932 తర్వాత (నాడు 36 పరుగులు) దక్షిణాఫ్రికాకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. వ్యక్తిగత కారణాలతో ట్రెంట్‌ బౌల్ట్‌ టెస్టుకు దూరం కావడంతో అవకాశం దక్కించుకున్న హెన్రీ పదునైన స్వింగ్, సీమ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. తన ఏడో ఓవర్లో రెండు వికెట్లు తీసిన హెన్రీ... ఆ తర్వాత మరో ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఓవరాల్‌గా హెన్రీ వేసిన 15 ఓవర్లలో 7 మెయిడెన్లు ఉన్నాయి. అనంతరం న్యూజిలాండ్‌ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 116 పరుగులు చేసి 21 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. నికోల్స్‌ (37 బ్యాటింగ్‌), కాన్వే (36) రాణించారు. ఫీల్డింగ్‌లోనూ ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసిన దక్షిణాఫ్రికా జట్టు కివీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top