భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అత్యంత ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచి ఇచ్చేశానని తెలిపాడు. పంజాబ్‌కు చెందిన నవజ్యోత్ సింగ్ సిద్ధు 1983- 1999 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.
తన కెరీర్‌లో మొత్తంగా 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన సిద్ధు.. టెస్టుల్లో 3202, వన్డేల్లో 4413 పరుగులు సాధించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా కొనసాగుతున్న సిద్ధు.. టీవీ షోల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఇక రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన నవజ్యోత్ సింగ్ సిద్ధు రెండుసార్లు ఎంపీగా పనిచేశాడు.
ఓ కుమారుడు, కుమార్తె
వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్, రాజకీయ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సిద్ధును పెళ్లాడిన సిద్ధుకు.. కుమారుడు కరణ్ సిద్ధు, కుమార్తె రబియా సిద్ధు సంతానం. ఇదిలా ఉంటే.. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. తాను బతికి ఉండగానే తన పిల్లలకు ‘విలువైన’ ఆస్తులను పంచి ఇచ్చినట్లు తెలిపాడు.

ఇద్దరికి చెరో ఇల్లు
‘‘పార్వతీ దేవి అమ్మవారి అనుగ్రహంతో అమృత్‌సర్‌లో నేను కట్టుకున్న ఇల్లు.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎక్కువగా ఇక్కడ నివసించలేకపోయాను. బిగ్‌బాస్ నుంచి స్టార్ టీవీలో హిందీ కామెంట్రీ, కపిల్ శర్మ షో.. ఇలా ఒక్కో ఆదాయ మార్గం
అయితే, రాజకీయాల ద్వారా ఒక్క పైసా కూడా నేను సంపాదించలేదు. నా కష్టార్జితంతోనే కొన్ని ఆస్తులు కూడబెట్టగలిగాను. పటియాలాలో మా నాన్నగారు కట్టించిన పూర్వీకుల ఇల్లు కరణ్‌కు వారసత్వంగా లభిస్తుంది.
అమృత్‌సర్‌లో నేను కట్టిన ఇల్లు రబియాకు ఇస్తున్నాము’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు పోస్ట్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా కూతురుతో కలిసి దిగిన ఫొటోలు, శివలింగానికి పూజ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.
రూ. 25 కోట్లు!
కాగా అమృత్‌సర్‌లో ప్రీమియర్ లొకాలిటీలో సిద్ధు కట్టిన ఇల్లు 49,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం, 2014-15 మధ్య కాలంలో నిర్మించిన ఈ ఇంటి విలువ దాదాపు రూ. 25 కోట్లు అని తెలుస్తోంది. స్విమ్మింగ్‌పూల్, జిమ్, స్పా వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయట.
అంతేకాదు.. ఈ విలాసవంతమైన ఇంటిలో ప్రత్యేకంగా శివుడి కోసం చిన్న ఆలయం కూడా నిర్మించినట్లు కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రతిష్టించిన శివలింగం దాదాపు రూ. 2.5 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. శివుడితో పాటు ఇతర దేవతా విగ్రహాలు, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కూడా ఇందులో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.

అమృత్‌సర్ ఇల్లు, పటియాలా నివాసం వద్ద కూతురితో సిద్ధు
చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!


