ముంబై మురిపించేనా! | Mumbai Indians have been performing disappointingly for the last five years | Sakshi
Sakshi News home page

ముంబై మురిపించేనా!

Mar 21 2026 4:08 AM | Updated on Mar 21 2026 5:01 AM

Mumbai Indians have been performing disappointingly for the last five years

గత ఐదేళ్లుగా నిరాశాజనక ప్రదర్శన

వరుసగా 13 సీజన్‌లు పరాజయంతోనే ప్రారంభం

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై ఒత్తిడి

స్టార్స్‌ సూర్య, రోహిత్, బుమ్రా, తిలక్‌ ఉన్నా ఆరో టైటిల్‌కు నిరీక్షణ  

ఎనిమిదేళ్ల వ్యవధిలో ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచి సంచలనం సృష్టించిన ముంబై ఇండియన్స్‌... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతోంది. గత ఐదు సీజన్‌లలో కనీసం ఒక్కసారీ ఫైనల్‌ చేరలేకపోయిన హార్దిక్‌ పాండ్యా బృందం... ఆరో టైటిల్‌ వేటకు సిద్ధమైంది. 

రోహిత్‌ శర్మ, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, డికాక్, సాంట్నర్, బౌల్ట్, బుమ్రా ఇలా జట్టు మొత్తం స్టార్‌లతో నిండి ఉండగా... వీరంతా కలిసికట్టుగా కదంతొక్కాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. ఇటీవల టీమిండియా టి20 ప్రపంచకప్‌ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, తిలక్‌ ఫుల్‌ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ బలాబలాలను పరిశీలిస్తే...  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ సాధించిన రెండు జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌ గత ఐదేళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తోంది. క్షణాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల స్టార్‌లు... బంతిని అదే పనిగా బౌండరీకి తరలించగల హిట్టర్లు... రెప్పపాటులో వికెట్లను పడగొట్టగల బౌలర్లు... ఇలా జట్టులో అన్నీ ఉన్నా ఆరో టైటిల్‌ మాత్రం దరిచేరడం లేదు. 

అంతర్జాతీయ స్థాయిలో వివిధ జట్లకు సారథ్యం వహించిన రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, సాంట్నర్‌ ఇలా నాయకులతో నిండి ఉన్న జట్టును ఈ సీజన్‌లో హార్దిక్‌ ఎలా నడిపిస్తాడనేది కీలకం. లీగ్‌ ఆరంభం నుంచే సచిన్, పాంటింగ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ 2013లో తొలిసారి ట్రోఫీ అందించాడు... ఆ తర్వాత అతడి సారథ్యంలోనే 2015, 2017, 2019, 2020లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. 

కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేకపోయిన ముంబై... ఈ సీజన్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ప్లేయర్లను తీర్చిదిద్దడంలో మంచి అనుభవమున్న ముంబై ఫ్రాంచైజీ... 2026 వేలంలో దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్‌ డికాక్, విండీస్‌ హిట్టర్‌ రూథర్‌ఫర్డ్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకుంది. హెడ్‌ కోచ్‌ జయవర్ధనే ఈ ఇద్దరి సేవలను ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం.  

రోహిత్‌ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గానే... 
ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్‌ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హిట్‌మ్యాన్‌’ ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. రోహిత్‌తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుండగా... తిలక్‌వర్మ, సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యా, నమన్‌లతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంది.

 బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఒక్క డికాక్‌ మినహా మిగిలిన వాళ్లంతా భారత ఆటగాళ్లే కావడంతో... విదేశీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే విషయంలో ఫ్రాంచైజీకి మంచి వెసులుబాటు ఉంది. ఈ కోటాలో డికాక్, రికెల్టన్, రూథర్‌ఫర్డ్, సాంట్నర్, విల్‌ జాక్స్, బాష్, ట్రెంట్‌ బౌల్ట్, ఘజన్‌ఫర్‌ అందుబాటులో ఉండగా... డికాక్, జాక్స్, సాంట్నర్, బౌల్ట్‌ తుదిజట్టులో ఉండటం ఖాయమే. పరిస్థితులను బట్టి రూథర్‌ఫర్డ్, ఘజన్‌ఫర్‌ను పరిశీలించవచ్చు.  

బుమ్రాపైనే భారం... 
టీమిండియా వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్‌ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రాపైనే ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా మన్ననలు అందుకుంటున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. బౌల్ట్, దీపక్‌ చాహర్‌ నుంచి అతడికి సహకారం అందితే ముంబైను ఆపడం ప్రత్యర్థులకు కష్టతరమే. 

తాజా టి20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌తో పాటు న్యూజిలాండ్‌ కెపె్టన్‌ సాంట్నర్‌ స్పిన్‌ భారం మోయనున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బౌలింగ్‌లో అవసరమైతే మయాంక్‌ మార్కండే, అశ్వని కుమార్, శార్దుల్‌ ఠాకూర్‌ అందుబాటులో ఉన్నారు. గత 13 సీజన్‌లను ముంబై జట్టు పరాజయంతో ప్రారంభించింది. ఈసారి ఓటమితో కాకుండా గెలుపుతో బోణీ కొడుతుందో లేదో చూడాలి.  

ముంబై ఇండియన్స్‌ జట్టు: హార్దిక్‌ పాండ్యా (కెపె్టన్‌), రోహిత్, సూర్యకుమార్, రాబిన్‌ మిన్జ్, రూథర్‌ఫర్డ్, రికెల్టన్, డికాక్, దానిశ్, తిలక్, నమన్‌ ధీర్, సాంట్నర్, రాజ్‌ బావా, అథర్వ, మయాంక్‌ రావత్, కార్బిన్‌ బాష్, విల్‌ జాక్స్, శార్దుల్, ట్రెంట్‌ బౌల్ట్, మయాంక్‌ మార్కండే, దీపక్‌ చాహర్, అశ్వని కుమార్, రఘుశర్మ, ఇజహార్, ఘజన్‌ఫర్, బుమ్రా.

ముంబై ఇండియన్స్‌ గణాంకాలు
ఆడిన మ్యాచ్‌లు    277 
గెలిచినవి    153 
ఓడినవి    124 
అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్‌ (2013, 2015, 2017, 2019, 2020), రన్నరప్‌ (2010). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement