FIFA WC: పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్‌కు చేరిన ఆఫ్రికా జట్టు

Morocco Reached World Cup Semi Final In Victory Over Portugal And Cristiano Ronaldo - Sakshi

పోర్చుగల్, క్రిస్టియానో రొనాల్డోను ఓడించిన మొరాకో

ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా రికార్డు  

ఇప్పటి వరకు 92 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ఆఫ్రికా ఖండానికి చెందిన 13 దేశాలు 48 సార్లు బరిలోకి దిగాయి. మూడు దేశాలు కామెరూన్, ఘనా, సెనెగల్‌ ఒక్కోసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరి అక్కడి నుంచే ఇంటిదారి పట్టాయి. ఎట్టకేలకు 49వ ప్రయత్నంలో మొరాకో రూపంలో ఓ ఆఫ్రికా జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటి ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చిన మొరాకో జట్టు క్వార్టర్‌ ఫైనల్లో పటిష్టమైన పోర్చుగల్‌ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే చివరి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో సెమీఫైనల్లో మొరాకో తలపడుతుంది.  

దోహా: లీగ్‌ దశలో ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం జట్టుపై తాము సాధించిన విజయం...  గత రన్నరప్‌ క్రొయేషియాను 0–0తో నిలువరించడం... గాలివాటమేమీ కాదని ప్రపంచ 22వ ర్యాంకర్‌ మొరాకో నిరూపించింది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆరోసారి పోటీపడిన మొరాకో ఈసారి సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ 9వ ర్యాంకర్‌ పోర్చుగల్‌ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో 1–0 గోల్‌ తేడాతో గెలిచింది.

తద్వారా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి అరబ్‌ దేశంగా రికార్డు నెలకొల్పింది. ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్‌ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్‌ ఎన్‌ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్‌’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది.

విఖ్యాత ప్లేయర్, కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డోను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై హ్యాట్రిక్‌ చేసిన గొన్సాలో రామోస్‌ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మొరాకో డిఫెన్స్‌ కూడా పటిష్టంగా ఉండటంతో పోర్చుగల్‌ జట్టు ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌పై గురి చూసి కొట్టలేకపోయారు.

చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్‌ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్‌ యాసిన్‌ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్‌ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top