
ముంబై: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమైనా... అతను అంగీకరించలేదు. టూర్ మధ్యలో వెనక్కి రాకుండా సిడ్నీలోనే ఉండిపోవాలని అతను నిర్ణయించుకున్నాడని బోర్డు వెల్లడించింది. ‘తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్‌తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి బాధాకర సమయంలో కుటుంబంతో ఉండే విధంగా భారత్‌కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అతను హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.
జట్టుతోపాటు ప్రాక్టీస్ కొనసాగిస్తానని సిరాజ్ అన్నాడు. అతని బాధను పంచుకుంటూ బోర్డు ఈ స్థితిలో సిరాజ్‌కు అండగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు సిరాజ్‌కు ధైర్యం చెబుతూ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలి. ఆసీస్ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 1 వన్డే, 3 టి20లు ఆడిన సిరాజ్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్ పర్యటనలో అతను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు.