టీమిండియాలో నో ప్లేస్‌.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ | Mohammed Shami Bangs On BCCIs Door With Incredible Hat Trick | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ.. మరోసారి సెలెక్టర్లకు సవాల్‌

Jun 7 2026 3:58 PM | Updated on Jun 7 2026 4:25 PM

Mohammed Shami Bangs On BCCIs Door With Incredible Hat Trick

భారత క్రికెట్‌లో గత కొంతకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే, అది మహ్మద్‌ షమీయే అని చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఫార్మాట్లకతీతంగా ఎంత అద్భుతంగా రాణించినా, జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు.

హర్షిత్‌ రాణా లాంటి బౌలర్ ఏమీ సాధించకపోయినా, ప్రతిసారి జట్టులో దర్శినమిస్తున్న వేల, షమీకి జరుగుతున్న అన్యాయంపై కొందరు తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. హర్షిత్‌కు ఉన్న అర్హతలేంటి, షమీకి లేనివేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై బీసీసీఐని, సెలెక్టర్లను, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను నిలదీస్తున్నారు.

తాజాగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించగా.. షమీకి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసినా, సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకోలేదు.

తాను లేని భారత జట్లను ప్రకటించిన గంటల వ్యవధిలోనే షమీ హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. బెంగాల్ టీ20 లీగ్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ టోర్నీలో సిలిగురి స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. రార్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు.

మొదటగా తన ఐపీఎల్ సహచరుడు షాబాజ్‌ అహ్మద్‌ను ఔట్ చేసిన షమీ.. ఆ తర్వాతి రెండు బంతుల్లో రోహిత్ కుమార్, దీపాంజన్ ముఖర్జీ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

షమీ (4/27)తో పాటు కరణ్ లాల్ (3/36) అద్భుత బౌలింగ్‌ చేయడంతో రార్ టైగర్స్‌పై సిలిగురి స్ట్రయికర్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్ట్రయికర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో షమీ, కరణ్‌ లాల్‌ ధాటికి తడబడిన రార్‌ టైగర్స్‌ 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement