ఫిఫా వరల్డ్ కప్‌లో హోస్ట్ జట్టు మెక్సికో అద్భుత ప్రదర్శనతో 40 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఎస్టాడియో అజ్‌టెకాలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ ఆవకాశాలను మెరుగుపర్చుకుంది.
ఆరంభం నుంచే దూకుడు.. 9 నిమిషాల్లో రెండు గోల్స్
వాతావరణం అనుకూలించని కారణంగా మ్యాచ్ ప్రారంభం గంట ఆలస్యమైనా, అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. హోమ్ క్రౌడ్ మద్దతుతో మెక్సికో మొదటి నుంచే ఆధిపత్యం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ నమోదయ్యాయి.
జూలియన్ క్వినోనెస్ అద్భుత గోల్‌తో ఖాతా తెరవగా.. వెంటనే రౌల్ జిమెనెజ్ రెండో గోల్‌తో ఆధిక్యం పెంచాడు.
మెక్సికో చివరిసారిగా 1986 ఎడిషన్‌లో బల్గేరియాపై నాకౌట్ విజయం సాధించింది. ఇప్పుడు అదే అజ్‌టెకా స్టేడియంలో, అదే స్కోర్‌లైన్‌తో మరోసారి నాకౌట్ గెలుపు నమోదు చేసింది. వరుసగా 7 నాకౌట్ పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం మెక్సికోకు భారీ ఊరట ఇచ్చింది.
ఈక్వెడార్‌కు నిరాశ
గ్రూప్ దశలో జర్మనీపై సంచలన విజయం సాధించి అనూహ్యంగా అంచనాలు పెంచుకున్న ఈక్వెడార్, ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. రెండో అర్ధభాగంలో పీరో హింకాపీ రెడ్ కార్డ్‌తో వైదొలగడంతో జట్టు 10 మందికే పరిమితమైంది.
తదుపరి పోరాటం ఎవరితో..?
మెక్సికో క్వార్టర్ ఫైనల్ చేరేందుకు ఇంగ్లండ్ లేదా డీఆర్ కాంగోతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే హోస్ట్ జట్టును అంచనా వేయడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.


