‘ఫిఫా’ ప్రపంచకప్‌పై పలువురు అభిమానుల అభిప్రాయం
భారీ టికెట్ ధరలు... అంతకుమించి ప్రయాణ ఖర్చులు
అనుకూలంగా లేని అమెరికా వీసా నిబంధనలు
న్యూయార్క్: సాధారణంగా ‘ఫిఫా’ ప్రపంచకప్ అంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు... మెగా టోర్నీ ఆరంభం నుంచే దేశవిదేశాల నుంచి అభిమానులు ఆతిథ్య దేశంలో వాలిపోవడం పరిపాటి. మైదానాలు, బార్‌లు, ఫ్యాన్ జోన్‌లు ఇలా ఎక్కడ చూసినా... సాకర్ ఫీవర్ కనిపిస్తుంటుంది. తమ అభిమాన ఆటగాళ్లను వరల్డ్‌కప్‌లో ప్రత్యక్షంగా వీక్షించాలనే ఉద్దేశంతో అభిమానులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మ్యాచ్‌లు చూసేందుకు మైదానాలకు వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది.
మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్‌కప్–2026 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 12న తొలి మ్యాచ్ జరగనుంది. అంటే మరో వారం రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వీక్షించే క్రీడా సంబరానికి తెరలేవనుందన్నమాట. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఫ్యాన్స్ సందడి అంతగా కనిపించడం లేదు. దీని వెనక పలు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
టికెట్ ధరలు విపరీతంగా పెంచడంతో పాటు మ్యాచ్‌లను మూడు దేశాల్లోని వివిధ వేదికల్లో నిర్వహిస్తుండటంతో ప్రయాణ ఖర్చులు భారీగా పెరగడంతో... బయట నుంచి వచ్చే అభిమానులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అమెరికాలో పర్యటించడానికి కూడా చాలా మంది అభిమానులు వెనుకాడుతున్నారు. లండన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి మైక్ విల్సన్ గత 20 ఏళ్లలో నాలుగు ప్రపంచకప్‌లను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఫుట్‌బాల్‌కు వీరాభిమాని అయిన విల్సన్ ఈసారి మాత్రం ఇంట్లో కూర్చొనే మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
అర్జెంటీనాకు చెందిన డాక్టర్ ఎమిలియానో గతంలో తమ దేశం ప్రపంచకప్‌లో ఆడుతుందంటే ఆ మ్యాచ్‌లకు తప్పక హాజరయ్యేవాడు. కానీ ఈసారి మాత్రం ఒకటీ రెండు మ్యాచ్‌లను తప్ప అన్నీంటిని ప్రత్యక్షంగా చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫైనాన్స్ మేనేజర్ పీటర్ బెర్గాకర్ 2010 ‘ఫిఫా’ ప్రపంచకప్ నుంచి నెదర్లాండ్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూశాడు. కానీ ఈసారి మాత్రం తమ జట్టు నాకౌట్‌కు చేరినా... అమెరికాలో మాత్రం అడుగుపెట్టబోనని అంటున్నాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినా... వీరాభిమానుల నుంచి ఇలాంటి స్పందన వస్తుండటం మాత్రం ఆశ్చర్యకరమే!
చుక్కలనంటుతున్న టికెట్ ధరలు...
2022లో ఖతార్‌లో జరిగిన వరల్డ్‌కప్‌తో పోల్చుకుంటే ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మెక్సికో, కెనడా, అమెరికాలో హోటళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. మెగా టోర్నీ కోసం చేస్తున్న కొలువుకు సెలవు పెట్టడంతో పాటు... దాదాపు రెండు మూడేళ్ల నుంచి దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టినా అన్నీ మ్యాచ్‌లు చూడలేని స్థితి ఉందని అభిమానులు వాపోతున్నారు. గత వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లకు మూడు టికెట్లకు కలిపి 69 డాలర్లు (రూ. 6,570) ఖర్చు అయితే... ఇప్పుడు అది ఏకంగా 265 డాలర్ల (రూ. 25, 234)కు పెరిగింది.
అలాగే రష్యా, ఖతార్‌లో మెగా టోర్నీ జరిగినప్పుడు ఒక నగరం నుంచి మరో నగరానికి మధ్య నిర్వాహకులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం మూడు దేశాల్లో కలిపి 16 మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఖతార్‌లోని గ్రౌండ్స్‌తో పోల్చుకుంటే వీటి మధ్య దూరం చాలా ఎక్కువ. అలాగే టికెట్‌ల అమ్మకాల విధానం, రీసేల్ టికెట్స్ పరిస్థితి అంతా సమీక్షించుకుంటే... అమెరికా దాకా వెళ్లి అగచాట్లు పడటం కంటే ఇంట్లో కూర్చొని హాయిగా మ్యాచ్‌లు చూడటం మిన్న అని జపాన్‌కు చెందిన టోమోనోరి అకుట్సు తెలిపాడు. గత ఐదు ప్రపంచకప్‌లను ప్రత్యక్షంగా వీక్షించిన అకుట్సు... ఈ టోర్నమెంట్‌కు ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే వరుసగా ఆరో ప్రపంచకప్ చూసే ప్రయత్నం మానుకునేవాడినని అంటున్నాడు.
డైహార్డ్ ఫ్యాన్స్ కూడా దూరం...
ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే ఇంగ్లండ్ ఐటీ ఉద్యోగి విల్సన్... ఈసారి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూడకూడదని నిర్ణయించుకున్నాడు. టికెట్ ధరలు తమ పరిధిలో లేకపోవడంతో... స్నేహితులతో కలిసి ‘ఫిఫా’ మెగా టోర్నీ చూడాలనే ఆలోచనను మానుకున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్‌లు వీక్షించిన విల్సన్ ఏ వరల్డ్‌కప్ పోరు కోసం కూడా 200 డాలర్ల (రూ. 19,045)కు మించి ఖర్చు చేసింది లేదు. కానీ ఈ సారి ఆ డబ్బుతో ఓ నామమాత్ర మ్యాచ్‌కు చివరి వరుసలోనూ టికెట్ లభించే అవకాశం లేదని చెబుతున్నాడు. దీంతో ఈ వేసవిలో సాకర్ వినోదాన్ని ఆస్వాదించేందుకు బదులు దానికంటే చాలా తక్కువ డబ్బుతో పోర్చుగల్‌లో విహరించేందుకు వెళ్తున్నట్లు తెలిపాడు.
సంపన్న వర్గాలకే పరిమితం...
విశేష జనాదరణ ఉన్న ‘ఫిఫా’ ప్రపంచకప్ ఈసారి సంపన్న వర్గాలకే పరిమితమయ్యేలా కనిపిస్తుంది. టోర్నీ ఆరంభానికి చాలా ముందే ప్రణాళిక ప్రకారం టికెట్‌లు కొనుగోలు చేసుకున్న వారికి కాస్త కలిసిరానుంది. ఏడాది క్రితం స్కాట్లాండ్ జట్టు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించగా... తక్షణమే ఆ దేశానికి చెందిన క్యాంప్‌బెల్ లూయిస్ అతడి మిత్ర బృందం సాకర్ సమరం కోసం సమాయత్తమైంది. 28 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్ జట్టు ప్రపంచకప్ ఆడుతుండటంతో భారీ డిమాండ్ ఉంటుందని ముందే ఊహించిన లూయిస్... అందుకు తగ్గట్లే జాగ్రత్త పడి ధరలు పెరగకముందే టికెట్‌లు కొనుగోలు చేసుకున్నాడు.
‘చివరిసారి మా జట్టు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించినప్పుడు మేమంతా చిన్న పిల్లలం. ఇన్నాళ్లకు ఆ సుందర దృశ్యాలు చూసే అవకాశం దక్కింది. మాతరంలో మరోసారి స్కాట్లాండ్ వరల్డ్‌కప్ ఆడుతుందో లేదో తెలియదు. అందుకే ఖర్చు కాస్త ఎక్కువైనా మ్యాచ్‌లను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాం’ అని లూయిస్ అన్నాడు.
అమెరికా వీసాతిప్పలు
‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా... ఇప్పటికే టికెట్ ధరలు, ప్రయాణ ఖర్చు, వసతి భారం ఎక్కువై సాకర్ అభిమానులు ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు అమెరికా వీసా నిబంధనలు ప్రేక్షకులను మరింత భయపెడుతున్నాయి. 2018లో రష్యా, 2022లో ఖతార్ తమ దేశాల్లో జరిగిన వరల్డ్‌కప్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం వీసా అనుమతులను సులభతరం చేయగా... అమెరికా మాత్రం కఠినమైన వీసా నిబంధనలను పాటిస్తోంది.
అల్జీరియా, కేప్ వెర్డే, ఐవరీకోస్ట్, సెనెగల్, ట్యూనీషియా వంటి దేశాల అభిమానులు అమెరికాలో అడుగుపెట్టాలంటే 15 వేల డాలర్లు (రూ. 14.28 లక్షలు) బాండ్‌ల రూపంలో చెల్లించాలని నిబంధన విధించింది. వరల్డ్‌కప్ దగ్గర పడుతున్నా కొద్ది దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో గత నెలలో అమెరికా ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. కానీ అప్పటికీ ఆలస్యమైంది. అమెరికా వీసా నిబంధనల కారణంగానే తమ దేశం నుంచి ఎక్కువ మంది ‘ఫిఫా’ సమరం వీక్షించేందుకు వెళ్లడం లేదని ఉరుగ్వే ట్రావెల్ ఏజెన్సీ సంఘం అధ్యక్షుడు కార్లోస్ పెరా చెప్పాడు. జర్మనీకి చెందిన ఓ అభిమాని డొనాల్డ్ ట్రంప్ విద్వేశ పూరిత విధానాల వల్లే తాను అమెరికాలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లడం లేదని అన్నాడు.


