భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్‌లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది.
ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 4244 పరుగులు చేసింది.
భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (191 మ్యాచ్‌ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్‌ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్‌ల్లో 2553 పరుగులు) ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్‌ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్‌ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.
అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్‌సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది.


