Malaysia Open: స్పెయిన్‌ షట్లర్‌ చేతిలో పదో సారి ఓడిన పీవీ సింధు

Malaysia Open: PV Sindhu Loses To Carolina Marin In Opening Round - Sakshi

కౌలాలంపూర్‌: కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమితో ప్రారంభించింది. మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. చిరకాల ప్రత్యర్థి, మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 12–21, 21–10, 15–21తో ఓడిపోయింది.

మారిన్, సింధు ఇప్పటివరకు 15 సార్లు ముఖాముఖిగా తలపడగా... మారిన్‌ పదిసార్లు సింధును ఓడించి, ఐదుసార్లు ఆమె చేతిలో ఓడిపోయింది. 2018 మలేసియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో చివరిసారి మారిన్‌పై సింధు గెలిచింది. చీలమండ గాయం కారణంగా ఐదు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న సింధు ఈ మ్యాచ్‌లో ఆడపాదడపా మెరిసింది. యాదృచ్ఛికంగా మూడు గేముల్లోనూ ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమంగా కాకపోవడం విశేషం.

తొలి గేమ్‌లో మారిన్‌ పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్‌లో సింధు విజృంభించింది. మూడో గేమ్‌లో మళ్లీ మారిన్‌ పుంజుకుంది. ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లిన మారిన్‌ అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్‌ 9–21, 13–21తో రెండో సీడ్‌ ఆన్‌ సె యంగ్‌ (కొరియా) చేతిలో ఓడిపోయింది. 

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత   నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 22–24, 21–12, 21–18తో భారత్‌కే   చెందిన ప్రపంచ పదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ 21–16, 21–13తో చోయ్‌ సోల్‌ జియు–కిమ్‌ వన్‌ హో (కొరియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top