
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన శుబ్‌మన్ గిల్‌కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.
విశ్రాంతి పేరిట
కాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్‌లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్‌మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. లార్డ్స్‌లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.
విమర్శల వర్షం
నిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.
రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి
‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.
ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?
‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?
బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.
కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్‌లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లతో భర్తీ చేసింది.
చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు