
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత్ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్‌లో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
తప్పని ఓటమి
లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్, బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.
తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్‌లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్‌లను ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు తీసుకుంది.
ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారా?
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.
టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం మేనేజ్‌మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు.
‘‘కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్‌బాస్టన్ లాంటి పిచ్‌పై బంతి కాస్త టర్న్ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.
గిల్‌పై గావస్కర్ ఆగ్రహం!
అంతేకాదు.. బ్యాటింగ్‌లో డెప్త్ కోసం ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకున్నామన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సమర్థనను కూడా గావస్కర్ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్ విఫలమవుతుంటే.. వాషింగ్టన్ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?
వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్ గిల్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (114 నాటౌట్)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్) రాణించాడు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్