
వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (Kraigg Brathwaite) అరుదై ఘనత సాధించాడు. విండీస్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న ఈ మాజీ కెప్టెన్.. ఇంత వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేయకుండా వంద టెస్టుల క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఏకైక క్రికెటర్‌గా
కాగా బ్రాత్‌వైట్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోనూ.. అదే విధంగా లీగ్ క్రికెట్‌లోనూ ఒక్క పొట్టి మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. ప్రపంచంలో ఇలా టీ20 మ్యాచ్ ఆడకుండానే.. టెస్టుల్లో వంద మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా బ్రాత్‌వైట్ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా (WI vs AUS)తో తాజా సిరీస్ రెండో టెస్టు సందర్బంగా ఈ ఘనత సాధించాడు. ఈ టీ20 లీగ్‌ల జమానాలో బ్రాత్‌వైట్ మాదిరి ఇలాంటి రికార్డు ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదని చెప్పవచ్చు.
కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బార్బడోస్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య గ్రెనెడా వేదికగా రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలిరోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యూ వెబ్‌స్టర్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ (63) అర్ధ శతకాలతో రాణించారు.
వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చగా.. జేడన్ సీల్స్ రెండు, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. విండీస్ టెస్టు స్పెషలిస్టు అయిన బ్రాత్‌వైట్‌కు సంప్రదాయ ఫార్మాట్లో ఇది వందో మ్యాచ్.
ఇక 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన 32 ఏళ్ల బ్రాత్‌వైట్.. 39 టెస్టుల్లో విండీస్‌కు సారథ్యం వహించాడు. విండీస్ తరఫున ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 100 టెస్టులు పూర్తి చేసుకున్న పదో వెస్టిండీస్ ప్లేయర్. ఓవరాల్‌గా 82వ ఆటగాడు.
బ్రాత్‌వైట్ చెత్త రికార్డు
వంద టెస్టులు ఆడిన టాప్-6 స్పెషలిస్టు బ్యాటర్లలో లోయస్ట్ యావరేజ్ బ్రాత్‌వైట్‌దే. అతడి బ్యాటింగ్ సగటు 32.83 కాగా.. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (36.11) ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బ్రాత్‌వైట్ ఖాతాలో మొత్తం పన్నెండు శతకాలు ఉన్నాయి. కాగా 100 టెస్టు క్లబ్‌లో అతి తక్కువ శతకాలు బాదిన ఆటగాడిగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (7 శతకాలు) ఉండగా.. అతడి తర్వాతి స్థానం బ్రాత్‌వైట్‌దే.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్‌గా..