Kohli poor form: విరాట్‌ కోహ్లికి ఏమైంది..?

Kohli poor form: What happened to Virat Kohli..sakshi Special - Sakshi

ఫామ్‌లేమితో స్టార్‌ బ్యాటర్‌ ఇబ్బందులు

అన్ని వైపులనుంచి విమర్శలు

24 వన్డే ఇన్నింగ్స్‌లలో 45.26 సగటు, 91.39 సగటుతో 1041 పరుగులు...ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు... 2019 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాతినుంచి ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి ప్రదర్శన ఇది. ఎలాంటి, ఏ స్థాయి ప్రమాణాల ప్రకారం చూసినా వన్డేల్లో ఇవి ఎంతో మెరుగైన బ్యాటింగ్‌ గణాంకాలు...మరి కోహ్లి విఫలమైనట్లా!  

21 అంతర్జాతీయ టి20ల్లో 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు... 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి... 2020 జనవరి నుంచి గణాంకాలు ఇవి. ఇదీ టి20లో ఒక రెగ్యులర్, పూర్తి స్థాయి బ్యాటర్‌ కోణంలో చూస్తే చక్కటి ప్రదర్శన. కానీ ఇక్కడా విమర్శలే.  

గత రెండున్నరేళ్లుగా 18 టెస్టుల్లో 27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే. ఒక్క సెంచరీ కూడా లేదు. ఇది మాత్రం విమర్శకు అవకాశమిచ్చే అది సాధారణ ప్రదర్శన. కానీ ఇదే సమయంలో ఇతర భారత టెస్టు బ్యాటర్ల స్కోర్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. మరి మొత్తంగా కోహ్లిని విఫలమవుతున్నాడని చెబుతూ, అతడిని పక్కన పెట్టాలంటూ వస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత? కోహ్లిలాంటి దిగ్గజం ఆటను కొన్ని ఇన్నింగ్స్‌లతో కొలవగలమా!  

సాక్షి క్రీడా విభాగం
దాదాపు 24 వేల అంతర్జాతీయ పరుగులు...మూడు ఫార్మాట్‌లలో 50కి పైగా సగటు...సుమారు దశాబ్దకాలం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన తర్వాత విరాట్‌ కోహ్లి ఆటపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతనిపై ఇలాంటి వ్యాఖ్యలు మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఇన్నేళ్లుగా దేశం తరఫున అతను చూపిన గొప్ప ప్రదర్శనలు, అందించిన ఘనమైన విజయాలు, చిరస్మరణీయ క్షణాలను కనీసం లెక్కలోకి తీసుకోకుండా కొందరు మాట్లాడుతున్న తీరు నిజంగా ఆశ్చర్యకరం.

ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లి సాధించిన ఘనతలే ఇప్పుడు అతనికి ప్రతికూలంగా మారినట్లున్నాయి. అద్భుత ప్రదర్శనతో అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లి...ఇప్పుడు వాటితో పోలిక రావడంతోనే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లి కాకుండా మరే బ్యాట్స్‌మన్‌ అయినా ఈ గణాంకాలతో కొనసాగితే అతను చాలా విజయవంతమైనట్లుగా లెక్క!  

సెంచరీలే ముఖ్యమా!
సగటు క్రికెట్‌ అభిమాని కోణంలో చూస్తే విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించి చాలా కాలమైంది కాబట్టి అతను విఫలమవుతున్నట్లే అనుకోవాలి. నిజమే...కోహ్లి 2019 నవంబర్‌లో తన ఆఖరి శతకం బాదాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని 70 సెంచరీలు పూర్తయ్యాయి. మరొక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్‌ (71)ను సమం చేస్తాడు. గతంలో ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ సచిన్‌ సెంచరీల రికార్డు (100) కూడా అలవోకగా సమం చేయగల సత్తా ఉందని అంతా కోహ్లిపై అంచనాలు పెంచేసుకున్నారు.

కోహ్లి 71వ సెంచరీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు రాలేదు! దాంతో అదే అసహనం సోషల్‌ మీడియా వేదికగా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్ల ద్వారా విమర్శగా మారింది. నిజానికి సెంచరీలు లేకపోయినా కోహ్లి ఆట ఘోరంగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే చక్కటి షాట్లు, కళాత్మక ఆటతీరులో ఎక్కడా తేడా రాలేదు. క్రీజ్‌లో తడబడటం, షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడటం కూడా కనిపించలేదు. నాటింగ్‌హామ్‌లో జరిగిన చివరి టి20లో మిడ్‌వికెట్‌ మీదుగా కొట్టిన ఫోర్, ఆ తర్వాత నేరుగా కొట్టిన సూపర్‌ సిక్సర్‌ కోహ్లి సత్తా ఏమిటో చూపించాయి.  

పోటీ పెరగడంతోనే...  
ఇటీవల అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు కోహ్లిని సాధారణ బ్యాటర్‌గా చూపిస్తోంది. దీపక్‌హుడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20లో 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. కానీ కోహ్లి రాకతో తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కలేదు. మరో వైపు సూర్యకుమార్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. పంత్, ఇషాన్‌ కిషన్, సంజు సామ్సన్‌లాంటి వాళ్లు బంతులను అలవోకగా గ్రౌండ్‌ బయటకు కొడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కోహ్లిపై విమర్శల జడి ఎక్కువవుతోంది.

వీరి దూకుడైన బ్యాటింగ్‌ ముందు కోహ్లి నమోదు చేస్తున్న 130–135 పరుగుల స్ట్రైక్‌రేట్‌ తక్కువగా కనిపిస్తోంది. మూడో స్థానంలో వచ్చే కోహ్లి ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. పదే పదే ‘విశ్రాంతి’ తీసుకోవడం కూడా అతనికి చేటు తెస్తోంది. టి20 ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో దశలవారీగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పు గురించి చర్చ జరుగుతున్న సమయంలో విండీస్‌తో టి20 సిరీస్‌నుంచి కూడా విశ్రాంతి! ఈ నేపథ్యంలో మళ్లీ విమర్శలకు అతను అవకామిచ్చాడు.

అసలు ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది. నాకు అస్సలు అర్థం కావడం లేదు. కోహ్లి ఎన్నో ఏళ్లుగా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి వేల పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అతనిలాంటి టాప్‌ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి సలహాలు అవసరం లేదు. ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోవడం, కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. ఒకటి, రెండు మ్యాచ్‌లు బాగా ఆడితే చాలు అంతా చక్కబడుతుంది.
–రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top