కోల్‌‘కథ’ హిట్‌ అవుతుందా? | Knight Riders set sights on fourth IPL title. | Sakshi
Sakshi News home page

కోల్‌‘కథ’ హిట్‌ అవుతుందా?

Mar 23 2026 1:01 AM | Updated on Mar 23 2026 7:18 AM

Knight Riders set sights on fourth IPL title.

నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌పై నైట్‌రైడర్స్‌ దృష్టి

హిట్టర్లతో బ్యాటింగ్‌ లైనప్‌ కళక

పేస్‌ బౌలింగ్‌ బృందం వెలవెల

స్పిన్నర్లపైనే అదనపు భారం

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల తర్వాత ‘ఐపీఎల్‌’ బుక్‌లో తమ కంటూ చరిత్ర లిఖించుకున్న ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌). మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ ‘త్రీ స్టార్‌’ చాంపియన్‌ గతేడాది మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 

2024లో విజేతగా నిలిచిన కేకేఆర్‌... గత సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి పేలవమైన ప్రదర్శనతో ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మాత్రం ఈ మరకను మరిచి... ఇంకో ఐదు రోజుల్లో ఆరంభమయ్యే లీగ్‌లో మెరుగైన ప్రదర్శనతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది.  –సాక్షి క్రీడా విభాగం

ఐపీఎల్‌ లీగ్‌లో ఫైనల్‌ చేరితే టైటిల్స్‌ను ఉడుం పట్టులా పట్టిన జట్టేదైనా ఉందంటే అది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒక్కటే! నాలుగుసార్లు 2012, 2014, 2021, 2024లలో తుదిపోరుకు అర్హత సంపాదించిన కేకేఆర్‌ ఒకే ఒక్కసారి (2021లో) మాత్రమే రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మిగతా మూడుసార్లు లీగ్‌ అసాంతం అసాధారణంగా రాణించిన జట్లను ఫైనల్లో బోల్తా కొట్టించి మరీ టైటిళ్లను ఎగరేసుకుపోయిన ఘనత కోల్‌కతాకే దక్కుతుంది. 

ఇప్పుడు కూడా ఇలాంటి ఆశల పల్లకితోనే ఈ సీజన్‌ బరిలోకి దిగుతోంది. అనుభవజ్ఞుడైన అజింక్య రహానే సారథ్యం గత సీజన్‌కు అక్కరకు రాలేదు. అలాగని అన్నీసార్లు అదే జరగదు! పైగా ఇది పొట్టి ఫార్మాట్‌! ఒక్క ఓవర్‌ చాలు ఫలితం తారుమారయ్యేందుకు..! కాబట్టి ప్రపంచ శ్రేణి హిట్టర్లు అందుబాటులో ఉన్న నైట్‌రైడర్స్‌ జట్టును గత సీజన్‌ ప్రదర్శనను బట్టి తక్కువ అంచనా వేయలేం. 

గ్రీన్‌పై గంపెడాశలతో...
కోల్‌కతా జట్టులో మేటి బ్యాటర్లున్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్లు సైతం అందుబాటులో ఉన్నారు. అయినా సరే పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియన్‌ బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను (రూ.25.20 కోట్లు) పాతిక కోట్లు పోసి కొనుక్కొంది. ఇంత భారీ మొత్తం పెట్టిన గ్రీన్‌ స్పెషలిస్టు టాపార్డర్‌ బ్యాటర్‌. ఓపెనింగ్‌ లేదంటే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ దిగేందుకే ఇష్టపడతాడు. 

కానీ టాప్‌–3లో అందరూ పాతుకుపోయిన బ్యాటర్లే బోలెడు మంది ఉన్నారు. కెప్టెన్‌ రహానే సహా సునీల్‌ నరైన్, ఫిన్‌ అలెన్, టిమ్‌ సీఫెర్ట్‌లు టాపార్డర్‌ బ్యాటర్లే. అంతే కాదు... నలుగురు విదేశీ ఆటగాళ్లు (నరైన్, ఫిన్, టిమ్, గ్రీన్‌)లు తుది జట్టుకు ఆడే ఆటగాళ్లు. అందుకే జట్టు మేనేజ్‌మెంట్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌ సర్దుబాటే అతిపెద్ద సవాలుగా మారింది. 

ఇంపాక్ట్‌ ఓకే... మరి కూర్పు?
విదేశీ స్టార్లే కాదు... భారత మేటి ఆటగాళ్లు సైతం నైట్‌రైడర్స్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ టి20ల్లోనే ప్రమాదకర బ్యాటర్‌. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో కేకేఆర్‌ హోమ్‌ గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో కివీ డాషింగ్‌ ఓపెనర్‌ దక్షిణాఫ్రికాపై సెమీస్‌లో 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. సీఫెర్ట్‌ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 

అలాగని భారత ఆటగాళ్లు తక్కువ కాదు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్‌ సింగ్, రాహుల్‌ త్రిపాఠిలతో కూడిన బ్యాటింగ్‌ బెంచ్‌ అసాధరణమని చెప్పొచ్చు. ముఖ్యంగా రఘువంశీ, త్రిపాఠి, త్యాగిలు ఇంపాక్ట్‌ ప్లేయర్లుగా బరిలోకి దింపినా... రెగ్యులర్‌ జట్టులో రింకూ, రమణ్‌దీప్‌లు కూడా హిట్టర్లు. వీరందరూ టి20 ఫార్మాట్‌కు అవసరమైన వారే. కానీ తుది 11 మంది కూర్పు కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ పెద్ద కసరత్తే చేయాలి. 

స్పిన్నర్లపైనే భారమంతా...
బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనపడుతోంది. కానీ బౌలింగే ఆందోళన పరుస్తోంది. కీలకమైన పేసర్లు గాయాల బారిన పడటంతో ఇప్పుడు బౌలింగ్‌ భారమంతా స్పిన్నర్లపైనే పడింది. తిప్పేసే సునీల్‌ నరైన్, వరుణ్‌ చక్రవర్తిలే కోల్‌కతా బలమైనా... దళమైనా! డెత్‌ ఓవర్లను నియంత్రించే హర్షిత్‌ రాణాలాంటి పేసర్‌ స్థానంలో ముజరబాని (జింబాబ్వే)ను తీసుకున్నారు. ఇది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ఒక్క పేస్‌ బౌలింగ్‌ కళ తప్పినా... ఆల్‌రౌండ్‌ సత్తా చాటే ఆటగాళ్లు కోల్‌కతాకు అందుబాటులో ఉన్నారు.

గాయాల బెడదతో దడదడ!
జట్టును ప్రధానంగా వేధిస్తున్న సమస్య గాయాలు. భారత పేస్‌ బౌలర్లు హర్షిత్‌ రాణా, ఆకాశ్‌ దీప్‌ సీజన్‌ మొత్తానికే దూరమయ్యారు. శ్రీలంక యార్కర్‌ స్పెషలిస్ట్‌ పతిరణ పరిస్థితి కూడా అదే! ఇప్పటికైతే ఆరంభ మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ సింహళ సీమర్‌ అందుబాటులోకి వచ్చేది అనుమానమే. దీంతో బౌలింగ్‌ దళం... ప్రత్యేకించి పేస్‌ విభాగం బలహీనమైంది. దీనివల్ల అందుబాటులో ఉన్న బౌలర్లపై అదనపు భారమే కాదు... ఒత్తిడి కూడా పడినట్లయింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు: అజింక్య రహానే (కెప్టెన్‌), టిమ్‌ సీఫెర్ట్, రచిన్‌ రవీంద్ర, కామెరాన్‌ గ్రీన్, ఫిన్‌ అలెన్, రోవ్‌మన్‌ పావెల్, రింకూ సింగ్, ఉమ్రాన్‌ మాలిక్, రమణ్‌దీప్‌ సింగ్, సునీల్‌ నరైన్, వరుణ్‌ చక్రవర్తి, ముజరబాని, వైభవ్‌ అరోరా, కార్తీక్‌ త్యాగి, అనుకూల్‌ రాయ్, దక్ష్  కమ్రా, సార్థక్‌ రంజన్, మనీశ్‌ పాండే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, రాహుల్‌ త్రిపాఠి, తేజస్వి సింగ్, ప్రశాంత్‌ సోలంకి, పతిరణ.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గణాంకాలు
ఆడిన మ్యాచ్‌లు         265 
గెలిచినవి         136
ఓడినవి         127
రద్దు             2

అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్‌ (2012, 2014, 2024), రన్నరప్‌ (2021). 

Advertisement
 
Advertisement
Advertisement