KL Rahul Wedding: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే!

KL Rahul Wedding With Athiya Suniel Shetty Confirms But The Twist Is - Sakshi

KL Rahul- Athiya Shetty Wedding: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి పెళ్లి గురించి వస్తున్న వార్తలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. ఈ విషయాన్ని అతియా తండ్రి, బాలీవుడ్‌ నటుడు సునిల్‌ శెట్టి ధ్రువీకరించాడు. అయితే, అందుకు ఇంకాస్త సమయం పడుతుందంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు. అందుకు గల కారణాన్ని కూడా ఈ వెటరన్‌ యాక్టర్‌ వెల్లడించాడు.

క్లీన్‌స్వీప్‌తో సరికొత్త ఉత్సాహం! 
కాగా టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన కేఎల్‌ రాహుల్‌.. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనతో తిరిగి జట్టులో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్‌కు సారథిగా ఎంపికయ్యాడు. 

శిఖర్‌ ధావన్‌ మినహా అంతా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో జింబాబ్వే గడ్డ మీద సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి ఈ టూర్‌ను మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు రాహుల్‌. ఇక జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే ఆసియా కప్‌-2022 టోర్నీలో పాల్గొనే నిమిత్తం యూఏఈకి పయనమయ్యాడు.

బిజీబిజీగా షెడ్యూల్‌!
ఇక ఆగష్టు 27న మొదలు కానున్న ఈ మెగా ఈవెంట్‌ పూర్తైన తర్వాత రోహిత్‌ సేన స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబరు 16- నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి సిద్ధం కావాల్సి ఉంది. ఇలా వరుసగా మూడు నెలల పాటు టీమిండియా బిజీబిజీగా గడుపనుంది.

అందుకే ఆలస్యం!
ఈ నేపథ్యంలో రాహుల్‌- అతియాల పెళ్లి ఆలస్యమయ్యే అవకాశం ఉందని సునిల్‌ శెట్టి పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాంట్‌ బాలీవుడ్‌తో ముచ్చటించిన సునిల్‌... ‘‘ఓ తండ్రిగా నా కూతురి పెళ్లి త్వరగా జరగాలని నేను కోరకుంటున్నాను. అయితే.. పిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే అప్పుడే అది జరుగుతుంది. ఆసియా కప్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌, వరల్డ్‌కప్‌ ఇలా రాహుల్‌కు బిజీ షెడ్యూల్‌ ఉంది.

తనకు బ్రేక్‌ ఉన్నపుడే వెడ్డింగ్‌ గురించి ప్లాన్‌ చేసుకుంటారు. పెళ్లి తంతు అనేది ఒక్కరోజులో హడావుడిగా జరిగిపోయేది కాదు కదా!’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సునిల్‌ మాటలతో రాహుల్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే రాహుల్‌ భాయ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ మామగారు కన్‌ఫర్మ్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. 

కాగా గత కొంతకాలంగా రాహుల్‌- అతియా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ వీళ్లిద్దరూ ఎప్పుడూ ఈ విషయం గురించి ధ్రువీకరించలేదు. అయితే, తాము కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తరచూ షేర్‌ చేస్తూ ఎప్పటికప్పుడు తమ బంధం గురించి హింట్‌ ఇస్తూనే ఉన్నారు.

ఇక సునిల్‌తో కూడా రాహుల్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. గతంలో ఓ షోలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘సునిల్‌ కేవలం క్రికెట్‌ ఫ్యాన్‌ మాత్రమే కాదు! ఆయన ఆటను బాగా అర్థం చేసుకుంటారు. నిజానికి క్రికెట్‌ అంటే ఆయనకు పిచ్చి అనుకోండి’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా రాహుల్‌- అతియాల కామన్‌ ఫ్రెండ్‌, నటి ఆకాన్ష రంజన్‌కపూర్‌ వీరిద్దరితో ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో ఈ ప్రేమ వ్యవహారం తొలిసారి వెలుగులోకి వచ్చింది.

చదవండి: IND Vs PAK: ఇటు బుమ్రా.. అటు షాహిన్; లోటును భర్తీ చేసేది ఎవరు?
Asia Cup 2022 IND Vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో విజేత ఎవరు? అఫ్రిది నుంచి ఊహించని ట్విస్ట్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top