
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడమే సౌకర్యవంతంగా ఉంటుందని భారత సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. టీమిండియా తరఫున ఇటీవలి కాలంలో మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతున్న రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపింగ్‌తో పాటు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఆకట్టుకున్నాడు. వన్డేల్లో నయా ఫినిషర్‌గా సేవలందిస్తున్న రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో 174 పరుగులు చేసి టీమిండియా మూడోసారి టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
భారత జట్టు తరఫున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ తర్వాత ఆరో ప్లేస్‌లో క్రీజులోకి అడుగుపెట్టి తన క్లాసిక్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి టాపార్డర్‌లోనే ఆడుతున్నా.
11 ఏళ్ల వయసులో మంగళూరులో తొలి మ్యాచ్ నుంచి టీమిండియాకు ఎంపికయ్యే వరకు దాదాపు ‘టాప్’లోనే బ్యాటింగ్ చేశా. అదే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. క్రికెట్ జట్టు క్రీడ. టీమ్ అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. జట్టు ఏం కోరుకుంటుందో అది అందివ్వడం ఆటగాడిగా నా బాధ్యత. కెరీర్ ఆరంభం నుంచే అదే కొనసాగిస్తున్నా’ అని రాహుల్ అన్నాడు. పలు అంశాలపై రాహుల్ మనోగతం అతడి మాటల్లోనే...
» ఐపీఎల్‌లో భాగంగా గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు సారథిగా వ్యవహరించాను. ఈసారి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే గతంలో కెప్టెన్‌గా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం ఆటగాడిగానే కొనసాగాలని అనుకుంటున్నాను.
» ఐపీఎల్ వేలం చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. గత మూడు సీజన్‌లలో సారథిగా జట్టును నడిపించా. అదే సమయంలో కోర్ టీమ్‌ను తయారు చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టా. దీంతో ఎంతో ఒత్తిడి ఉండేది. వేలం అంటే ఆటగాడి కెరీర్‌కు సంబంధించింది. అదే సమయంలో ఫ్రాంచైజీలు వేరే విధంగా ఆలోచిస్తాయి. ఆటగాడి భవితవ్యం వేలంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఒత్తిడి తప్పదు.
» ఐపీఎల్ వేలం సమయంలో నేను కూడా ఒత్తిడికి గురయ్యాను. అయితే ఈసారి కేవలం ఆటగాడిగానే ఆడాలనుకుంటున్నాను. కెరీర్‌లో ఇదే సరైన నిర్ణయం అనుకుంటున్నా. చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా.
» ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్ జిందాల్‌తో మంచి స్నేహం ఉంది. ఆట గురించే కాకుండా అనేక విషయాలపై మేము సుదీర్ఘంగా చర్చించుకుంటాం. క్రికెట్‌పై అమితాసక్తితో పాటు చక్కటి అవగాహన ఉంది. మంచి జట్టు అందుబాటులో ఉంది. కొత్త ఫ్రాంచైజీతో కలిసి ప్రయాణించేందుకు ఆసక్తిగా చూస్తున్నా.
» కొత్త జట్టులో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టడం సహజం. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ వంటి ఆటగాళ్లతో చక్కటి అనుబంధం ఉంది. వారితో కలిసి టీమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా. జట్టులో అటు అనుభవజు్ఞలు, ఇటు యువ ఆటగాళ్లు
మెండుగా ఉన్నారు. ఇలాంటి ప్రతిభావంతులతో కలిసి ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నాను.
» సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉంటేనే సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగవచ్చు. కెరీర్‌లో ఎన్నో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నా. వెనక్కి తిరిగి చూసుకుంటే వాటన్నింటికంటే ఈ ప్రయాణమే అద్భుతంగా అనిపిస్తోంది. ఇక భవిష్యత్తుపై దృష్టి పెట్టా. ఇప్పటి వరకు నేర్చుకున్న దానిని ప్రణాళికాబద్ధంగా అమలు పరచడంపై దృష్టి పెడతా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించిపెట్టడమే నా లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment