‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’ | KKR coach Brendon McCullum after humiliating defeat vs RCB | Sakshi
Sakshi News home page

‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’

Oct 23 2020 5:22 AM | Updated on Oct 23 2020 5:22 AM

KKR coach Brendon McCullum after humiliating defeat vs RCB - Sakshi

అబుదాబి: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  చేతిలో ఎదురైన ఘోర పరాభవంపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ స్పందించాడు. కనీస స్థాయిలో కూడా తాము బ్యాటింగ్‌ చేయలేకపోయామని, ఈ విషయంలో పిచ్‌లో సమస్యేమీ లేదని అన్నాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మాట్లాడిన మెకల్లమ్‌ ‘ నిజాయితీగా చెప్పాలంటే మేము పూర్తిగా విఫలమయ్యాం. ఈ వికెట్‌పై ఆడటం మరీ అంత కష్టమేం కాదు. సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడికి మోరిస్‌ కూడా తోడవ్వడంతో... మా బ్యాట్స్‌మెన్‌ ధైర్యంగా బంతులను ఎదుర్కొనలేక పోయారు. దూకుడుగా ఆడాలనే ప్రణాళికతో మేము మ్యాచ్‌ను ఆరంభించాం. కానీ అలా జరగలేదు. మా టాప్‌ ఆర్డర్‌ మరింతగా ఆడాల్సి ఉంది. ఇదొక పాఠంగా భావించి... మా తదుపరి మ్యాచ్‌ నుంచి మళ్లీ విజయాల బాట పడతాం. ఇప్పటికీ లీగ్‌లో మాకు మంచి అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించాడు.  

కోహ్లి మాట వినలేదు... వికెట్‌ తీశాడు!
ఒకే ఒక్క మ్యాచ్‌తో ‘జీరో’ నుంచి ‘ హీరో’గా తనను తాను సిరాజ్‌ ప్రమోట్‌ చేసుకున్నాడు. కొత్త బంతితో బౌలింగ్‌ చేసే అవకాశం దక్కడంతో... చెలరేగిన సిరాజ్‌ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘డ్రీమ్‌ స్పెల్‌ (4–2–8–3)’తో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. తీసిన మూడు వికెట్లలో నితీశ్‌ రాణా వికెట్‌ కోసం వేసిన ఇన్‌స్వింగ్‌ బంతి అయితే సూపర్‌ అనే చెప్పాలి. అయితే ఈ బంతి వేసే ముందు తాను కోహ్లి మాటను పెడ చెవిన పెట్టానని సిరాజ్‌ పేర్కొనడం విశేషం. రాణా బ్యాటింగ్‌కు రాగానే... బౌన్సర్‌ వేయమంటూ కోహ్లి తనకు సూచించాడని... అయితే రన్నప్‌ మొదలు పెట్టేముందు బౌన్సర్‌ వద్దు... ఫుల్‌ బాల్‌ వేయాలని నిర్ణయించుకొని బంతిని వేశానని సిరాజ్‌ తెలిపాడు. దాంతో ఆ బంతి లోపలికి వెళ్తూ వికెట్లను గిరాటు వేయడంతో... రాణా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement