బెంగళూరు: కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్-50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్-నికీ కలియంద పునాచా (భారత్) జోడీ 7-5, 6-1తో టాప్ సీడ్ ప్రజ్వల్ దేవ్-నితిన్ కుమార్ సిన్హా (భారత్) జంటపై విజయం సాధించింది.
71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్-పునాచా మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తొలి సర్వీస్‌లో 27 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 12 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్నా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.
పదో టోర్నీలో మాత్రం టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో పీటర్ బార్ బిరుకోవ్ (రష్యా)-గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లతో సాకేత్-పునాచా తలపడతారు. రెండో సెమీఫైనల్లో బిరుకోవ్-లొమాకిన్ 7-6 (7/4), 7-6 (7/4)తో ఆదిల్ కల్యాణ్‌పూర్-ముకుంద్ శశికుమార్ (భారత్)లపై విజయం సాధించారు.


