నాటి ప్రపంచ ఛాంపియన్‌.. నేడు ఛాయ్‌ అమ్ముకుంటున్నాడు

Karate Player With Over 60 Tournament Medals Selling Tea In Mathura - Sakshi

ఆగ్రా: పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని ధీన స్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు.

2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు.

లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్‌ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్‌ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. 
చదవండి: బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్‌ బయటపడ్డాడు.. లేకపోతే..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top