FIH Hockey Junior World Cup: హాకీలో జూనియర్ల సమరం

Jr Hockey World Cup: India to begin title defence against France on Wednesday - Sakshi

నేటినుంచి ప్రపంచ కప్‌

ఫ్రాన్స్‌తో భారత్‌ తొలి పోరు

భువనేశ్వర్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం సాధించడంతో హాకీ ఆటకు కొత్త కళ వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ల బాటలో మరో పెద్ద విజయాన్ని అందుకునేందుకు జూనియర్లు సన్నద్ధమవుతున్నారు. నేటినుంచి జరిగే జూనియర్‌ ప్రపంచ కప్‌ హాకీలో భారత జట్టు ఫేవరెట్‌గా దిగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కూడా అయిన మన టీమ్‌తో పాటు మరో 15 జట్లు టోర్నీ బరిలో ఉన్నాయి. 

2016 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత్‌...టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అస్త్ర శస్త్రాలతో రెడీ అయింది. గ్రూప్‌ ‘బి’లో నేడు తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో భారత్‌ తలపడుతుంది. ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత సీనియర్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. గ్రూప్‌ ‘బి’లో భారత్, ఫ్రాన్స్‌లతో పాటు కెనడా, పోలాండ్‌ జట్లు ఉన్నాయి. 25న కెనడాతో... 27న పోలాండ్‌తో భారత్‌∙తన తదుపరి మ్యాచ్‌లను ఆడనుంది. గ్రూప్‌లో టాప్‌–2గా నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ డిసెంబర్‌ 5న జరగనుంది. కరోనా వల్ల స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు.  

మూడో టైటిల్‌పై గురి...
ఇప్పటికే రెండు సార్లు (2001, 2016లలో) చాంపియన్‌గా నిలిచిన భారత్‌ టోర్నీలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మ్యాచ్‌లన్నీ భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అవకాశం. కోవిడ్‌–19 దృష్ట్యా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నాయి. అయితే టైటిల్‌ వేటలో జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌ నుంచి మన జట్టుకు పోటీ తప్పకపోవచ్చు.

జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌ను జర్మనీ అత్యధికంగా ఆరు సార్లు గెల్చుకోవడం విశేషం. ఈ టోర్నీ కోసం టీమిండియా గత కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమిస్తోంది. వెటరన్‌ ఆటగాడు కరియప్ప టీమ్‌కు కోచ్‌గా ఉన్నప్పటికీ... సీనియర్‌ టీమ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ యువ టీమిండియాపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. సీనియర్‌ జట్టుతో మ్యాచ్‌లను ఆడిస్తూ యువ భారత్‌ను ప్రపంచ కప్‌ కోసం సిద్ధం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top