
జానీ బెయిర్‌స్టో (PC: Jonny Bairstow Twitter)
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వకుండా వరుస సిరీస్‌లు నిర్వహించడంపై ఐసీసీతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్పందించిన విధానం ఆసక్తికరంగా మారింది. ‘‘సహజంగానే కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, నేను మాత్రం వీలైనంత ఎక్కువ కాలం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
నా వరకైతే సమీప భవిష్యత్తులో నేను అలాంటి నిర్ణయమేదీ తీసుకోబోను. వీలైనంత కాలం ఆడుతూనే ఉంటాను’’ అని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్ల జట్లలోనూ భాగం కావడం తనకిష్టమని, తద్వారా ఆటలో కొత్తదనం ఆస్వాదించే అవకాశం దొరుకుతుందని వ్యాఖ్యానించాడు.
కాగా స్వదేశంలో న్యూజిలాండ్ టెస్టు సిరీస్, టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీలతో ఆకట్టుకున్నాడు బెయిర్‌స్టో. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ముగిసిన అనంతరం బెయిర్‌స్టో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగమయ్యాడు.
ఇందులో భాగంగా శుక్రవారం నాటి రెండో వన్డేలో 27 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఇక వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!
Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్!