క్రికెట్ ఐర్లాండ్ ఇటీవలే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.
కాగా గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు అఫ్గనిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్‌లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.
అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్ అఫ్గన్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఆడింది. ఇక ఐర్లాండ్ తాజాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్‌తో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.
ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. క్రికెట్ ఐర్లాండ్ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్ అఫ్గనిస్తాన్‌తో సిరీస్ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.
తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్‌కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైంది.
కనీసం సూపర్-8 దశ చేరకుండానే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్ పదవికి పాల్ స్టిర్లిండ్ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బ్రీడీ, బెల్‌ఫాస్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


