ఇంగ్లండ్ వెటరన్ పేసర్ మార్క్ వుడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్ ఒకరు తనను బాగా ఇబ్బంది పెట్టారన్నాడు. ఆరోగ్యం బాగాలేకపోయినా మ్యాచ్ ఆడాల్సిందేనని పట్టుబట్టారని ఆరోపించాడు.
బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఐదు మ్యాచ్‌లు పూర్తైన తర్వాత.. తదుపరి మ్యాచ్‌కు మరో మూడు రోజుల సమయం ఉంది. అప్పుడు నా ఆరోగ్యం చెడిపోయింది. ప్రతీ అరగంటకు డాక్టర్ వచ్చి నన్ను పరీక్షిస్తూ ఉన్నారు.
బెడ్ మీద నుంచి లేచే ఓపిక కూడా లేదు
అప్పుడే జట్టు యజమాని నాకు ఫోన్ చేశారు. ‘ఎలా ఉన్నావు?.. మ్యాచ్‌కు సిద్ధమేనా?’ అని అడిగారు. ‘నిజం చెప్పాలంటే నేనేమీ తినలేకపోతున్నాను. కనీసం డ్రింక్స్ కూడా తీసుకోలేకపోతున్నా. అసలు బెడ్ మీద నుంచి లేచే ఓపిక కూడా లేదు’ అని బదులిచ్చాను.
ఇందుకు స్పందిస్తూ.. ‘నీ కోసం ఇంకో డాక్టర్‌ని పంపిస్తా. మెరుగైన వైద్యం ఇప్పిస్తా’ అని చెప్పారు. ఆ మరుసటి రోజే మళ్లీ నాకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అయితే, నా ఆరోగ్యం అస్సలు మెరుగుపడలేదని చెప్పాను.
ప్రైవేట్ విమానం పంపిస్తా
అప్పుడు ఆయన.. ‘ఒక పని చేద్దాం. నీకోసం నేను ప్రైవేట్ విమానం పంపిస్తా. నువ్వు దాంట్లో మైదానానికి వచ్చి మ్యాచ్ ఆడు. ఆ వెంటనే అదే విమానంలో నీ బెడ్ వరకూ చేరుస్తాం’ అని అన్నారు’’ అని మార్క్ వుడ్ సంచలన ఆరోపణలు చేశాడు.
తాను కూడా ఓనర్ చెప్పిన విషయం గురించి ఆలోచించానని.. అయితే, తండ్రి మాటకు తలొగ్గి ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపాడు. కానీ ఆ ఓనర్ ఎవరో మాత్రం వెల్లడించలేదు.
కాగా మార్క్‌వుడ్ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఒక మ్యాచ్ ఆడిన ఈ ఇంగ్లిష్ పేసర్.. 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. లక్నో తరపున 11 వికెట్లు కూల్చాడు.


