
Photo Courtesy: BCCI
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపు (మే 17) జరుగబోయే కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో పునఃప్రారంభం కానుంది. అయితే లీగ్ పునఃప్రారంభానికి వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. రేపటి మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో నిన్నటి నుండి వర్షం జోరుగా కురుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవారం రోజులు బెంగళూరులో ఇదే వాతావరణం కొనసాగనున్నట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఇదివరకే బెంగళూరుకు చేరుకున్నాయి. వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు పరిమితమయ్యారు.
Tim David enjoying the Bengaluru rain. 😂🔥 pic.twitter.com/nOKhZhHukO
— Johns. (@CricCrazyJohns) May 16, 2025
వర్షంలో ఎంజాయ్ చేసిన టిమ్
నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురుస్తుండగా ఆ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన విన్యాసాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. టిమ్ షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ తెగ ఎంజాయ్ చేశాడు.
కొన్ని ఓవర్లైనా జరుగుంది
చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో భారీ వర్షం కురిసినా రేపటి మ్యాచ్ కొన్ని ఓవర్ల పాటైనా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా రద్దైతే..
వర్షం కారణంగా రేపు జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ మరో పాయింట్ లభించినా టాప్ ప్లేస్‌కు ఎగబాకుతుంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఇప్పటికే అనధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు రేపటి మ్యాచ్ రద్దైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది.
పాటిదార్, హాజిల్‌వుడ్ దూరం
రేపటి మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దూరం కానున్నాడని తెలుస్తుంది. లీగ్ వాయిదాకు ముందే గాయపడిన అతను ఇంకా కోలుకోలేదని సమాచారం. పాటిదార్ స్థానంలో రేపటి మ్యాచ్‌లో జితేశ్ శర్మ ఆర్సీబీకి సారథ్యం వహించవచ్చు.
మరోవైపు భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. హాజిల్‌వుడ్ లీగ్ తదుపరి లెగ్ ఆడేందుకు అంగీకారం తెలిపినప్పటికీ.. భారత్‌కు ఇంకా తిరిగి రావాల్సి ఉంది.