IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌?! | IPL 2024: Williamson, Gill In Contention As GT Hunt For New Skipper - Report - Sakshi
Sakshi News home page

IPL 2024: కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌.. సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్‌?!

Published Sat, Nov 25 2023 10:25 AM | Last Updated on Sat, Nov 25 2023 11:08 AM

IPL 2024: Williamson Gill in Contention As GT Hunt For New Skipper: Report - Sakshi

IPL 2024: భారత క్రికెట్‌ వర్గాల్లో హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌ భవిత్యంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఐపీఎల్‌-2024 వేలానికి ముందే ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ తిరిగి ముంబై ఇండియన్స్‌తో చేరనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ వదులుకోవడానికి కూడా అతడు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో.. ‘‘కెరీర్‌లో గడ్డు పరిస్థితులో ఉన్న వేళ తనను పిలిచి అవకాశమిచ్చి..  కెప్టెన్‌గా కొత్త హోదా ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ పట్ల హార్దిక్‌ వైఖరి సరైంది కాదు. నిన్ను కాదనుకున్న ముంబై ఫ్రాంఛైజీతో తిరిగి చేతులు కలపడానికి డబ్బే కారణమా?’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు పాండ్యాను ప్రశ్నిస్తున్నారు.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం ద్వారా వ్యాపిస్తున్న ఈ వదంతులపై హార్దిక్‌ పాండ్యా ఇంతవరకు స్పందించకపోవడం చూస్తుంటే.. ఇదంతా నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర చర్చ కూడా తెరమీదకు వచ్చింది.

గుజరాత్‌ సారథి ఎవరు?
ఐపీఎల్‌-2022 ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపాడు హార్దిక్‌ పాండ్యా. అతడి సారథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టు ఐపీఎల్‌-2023 సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరింది.

ఈ నేపథ్యంలో విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన పాండ్యా ఒకవేళ నిజంగానే టైటాన్స్‌ను వీడితే.. తదుపరి నాయకుడు ఎవరన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విలియమ్సన్‌ లేదంటే గిల్‌?
హార్దిక్‌ వారసుడిగా అనుభవజ్ఞుడైన కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌)కు పగ్గాలు అప్పజెప్పుతారని కొంతమంది పేర్కొంటుండగా.. టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్‌ గిల్‌ ఉండగా.. ఆ ఛాన్సే లేదని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

యాజమాన్యం గిల్‌ వైపే
భారత జట్టు భావి కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్న గిల్‌.. కచ్చితంగా గుజరాత్‌ టైటాన్స్‌ సారథి అవుతాడని తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. గతంలో టైటాన్స్‌ యాజమాన్యం కూడా శుబ్‌మన్‌ గిల్‌కు జట్టును ముందుండి నడిపించగల సత్తా ఉందని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

అటు ఆటగాడిగా.. ఇటు కెప్టెన్‌గానూ సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించగల సత్తా ఉన్న ఆటగాడంటూ గిల్‌ రికార్డులను తెరమీదకు తెస్తున్నారు. కాగా.. ఐపీఎల్‌-2023లో 3 సెంచరీల సాయంతో.. 890 పరుగులు చేసి శుబ్‌మన్‌ గిల్‌ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.

పాపం సన్‌రైజర్స్‌!
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ మూవ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు పెద్ద చిక్కే వచ్చిపడిందని ఆ జట్టు అభిమానులు ఉసూరుమంటున్నారు. ‘‘30 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా కనీసం మరో మూడేళ్లపాటు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా కొనసాగగల సత్తా ఉన్నవాడే! రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల సారథిగా బాధ్యతలు చేపట్టనున్న పాండ్యా వల్ల జట్టుకు మరింత ప్లస్‌ అవుతుందే తప్ప.. అతడి వల్ల వచ్చే నష్టమేమీ లేదు.

కాబట్టి.. గుజరాత్‌ జట్టుతోనే ఉంటే.. పాండ్యా కారణంగా.. గిల్‌ ఇప్పట్లో కెప్టెన్‌ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అతడు ఫ్రాంఛైజీ మారాలనుకుంటే గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ గిల్‌ను కొనుగోలు చేసి కెప్టెన్‌ చేస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి’’ అని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే, తాజాగా ముంబై ప్రతిపాదనతో గుజరాత్‌ టైటాన్స్‌ హార్దిక్‌ పాండ్యా విషయంలో వదిలేయాలనే నిర్ణయం తీసుకుంటే.. గిల్‌ను తమ కెప్టెన్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇదొక పెద్ద షాక్‌ లాంటిదే అని ఫ్యాన్స్‌ వాపోతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 

చదవండి: సచిన్‌, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్‌? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement