#Virat Kohli: అతడు అద్భుతం! హర్షల్‌ కూడా తక్కువేమీ కాదు.. నిజానికి వాళ్లిద్దరి వల్లే ఇలా!

IPL 2023 RCB Vs RR: Kohli Praises RCB Pacer Bowling As Well As I Have Ever Seen - Sakshi

IPL 2023 RCB Vs RR: టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కీలక వికెట్‌ తీసి మంచి బ్రేక్‌ అందించాడని కొనియాడాడు. గతంలో తానెప్పుడూ సిరాజ్‌ నుంచి ఇలాంటి ప్రదర్శన చూడలేదంటూ సిరాజ్‌ ఆట తీరును ప్రశంసించాడు.

కోహ్లి డకౌట్‌.. కానీ వాళ్లిద్దరూ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆర్సీబీ ఆదివారం తలపడింది. సొంత మైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్‌ కోహ్లి డకౌట్‌ కాగా.. ఫాఫ్‌ డుప్లెసిస్‌(62), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (77) అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఈ మేర స్కోరు సాధ్యమైంది.

కీలక వికెట్‌ కూల్చి
టార్గెట్‌ ఛేదనలో భాగంగా రాజస్తాన్‌కు ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ను డకౌట్ చేసి ఆర్సీబీకి శుభారంభం అందించాడు. ఇక హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. డేవిడ్‌ విల్లే ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన సంజూ శాంసన్‌ బృందం 182 పరుగులకే పరిమితమైంది. దీంతో ఏడు పరుగుల తేడాతో కోహ్లి సేన గెలుపొందింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

పర్పుల్‌ క్యాప్‌ పొందేందుకు అర్హుడు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌ అద్భుతంగా ఆడాడు. ఆరంభంలోనే జోస్‌ బట్లర్‌ వికెట్‌ పడగొట్టాడు. గతంలో కంటే ఇప్పుడు మరెంతో మెరుగ్గా బౌలింగ్‌ చేస్తున్నాడు. కొత్త బంతితోనూ రాణిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో.. పట్టుదలతో ఆడుతున్నాడు.

హర్షల్‌ వల్లే
పర్పుల్‌ క్యాప్‌ పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. బౌలింగ్‌ విభాగానికి నాయకుడిగా ఎదగగలడు’’ అని సిరాజ్‌ను ప్రశంసించాడు. అదే విధంగా హర్షల్‌ పటేల్‌ డెత్‌ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్‌ చేస్తాడని.. ఈరోజు కూడా అదే పనిచేశాడంటూ అతడికి క్రెడిట్‌ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. జోష్‌ హాజిల్‌వుడ్‌ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.

టాప్‌లో సిరాజ్‌
ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 160 పరుగుల స్కోరుకే పరిమితమవుతామని భావించానని.. అయితే, ఫాఫ్‌, మాక్సీ కారణంగానే 180 పరుగులకు పైగా స్కోరు చేశామని కోహ్లి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో సిరాజ్‌ 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 13 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌నకు చేరుకున్నాడు. పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. ఏడింటిలో నాలుగు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: వాళ్లంతా వేస్ట్‌, రహానేనే బెస్ట్‌.. టీమిండియాకు ఎంపిక చేయండి..!
#HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top