IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్‌ 4/4 | Sakshi
Sakshi News home page

IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్‌ 4/4

Published Sun, Apr 7 2024 2:52 AM

Royals won by 6 wickets against Bengaluru - Sakshi

6 వికెట్లతో బెంగళూరుపై రాయల్స్‌ ఘనవిజయం 

బట్లర్‌ మెరుపు శతకం 

కోహ్లి సెంచరీ వృథా 

జైపూర్‌: ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్‌; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐపీఎల్‌లో 8వ శతకం సాధించగా, కెప్టెన్  డుప్లెసిస్‌ (33 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

అనంతరం రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకం సాధించగా, కెప్టెన్  సంజూ సామ్సన్‌ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఫ్రాంచైజీకి చెందిన ‘రాయల్‌ రాజస్తాన్‌ ఫౌండేషన్‌’ చేపట్టిన ‘పింక్‌ ప్రామిస్‌’లో భాగంగా మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం కోసం రాజస్తాన్‌ జట్టు నిలువెల్లా గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగింది.  

కోహ్లి శతక్కొట్టాడు కానీ... 
బెంగళూరుకు ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, డుప్లెసిస్‌ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 53/0 స్కోరు చేసింది. ఓవర్లు గడుస్తున్న కొద్దీ బ్యాటర్లు పాతుకుపోయినా... పరుగుల వేగం మాత్రం అంతంతమాత్రంగానే సాగింది. కోహ్లి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు వందకు చేరింది. అప్పటికీ ఓపెనింగ్‌ జోడీనే అజేయంగా ఉంది. సింహభాగం ఓవర్లు (14) ఇద్దరే ఆడారు.

కానీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై ధాటిని ప్రదర్శించలేకపోయారు. 14వ ఓవర్లో డుప్లెసిస్‌ నిష్క్ర మించడంతో 125 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ (1), సౌరవ్‌ చౌహాన్‌ (9) నిరాశపరిచారు. గ్రీన్‌ (5 నాటౌట్‌) వచ్చినా... కోహ్లి 67 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచినా... డెత్‌ ఓవర్లలో బెంగళూరు పెద్దగా మెరిపించలేదు. 19వ ఓవర్లో 4 పరుగులు, 20వ ఓవర్లో 14 పరుగులు రావడంతో 200 మార్క్‌కు ఆమడ దూరంలో నిలిచింది.  

బట్లర్, సామ్సన్‌ ధనాధన్‌ 
జైస్వాల్‌ (0) ఇన్నింగ్స్‌ రెండో బంతికే డకౌట్‌ కావడంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగింది. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. బట్లర్‌కు కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ జతవడంతో చేజింగ్‌ చాలా సులువుగా సాగింది. మయాంక్‌ డాగర్‌ వేసిన 6వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన బట్లర్‌ 4, 0, 4, 6, 4, 0లతో 20 పరుగులు పిండుకున్నాడు.

పవర్‌ప్లేలో రాయల్స్‌ స్కోరు 54/1 తక్కువే అయినా అక్కడ్నుంచి ఇద్దరు దంచేసే పనిలో పడటంతో బౌండరీలు, సిక్సర్లు క్రమం తప్పకుండా వచ్చేశాయి.  బట్లర్‌ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే సామ్సన్‌ ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయింది. ఇద్దరి దూకుడు కొనసాగడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గిపోయింది.

సామ్సన్‌ను ఎట్టకేలకు సిరాజ్‌ అవుట్‌ చేయగా... 148 పరుగుల రెండో వికెట్‌కు భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్‌ (4), జురెల్‌ (2) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ అప్పటికే 18 బంతుల్లో 14 పరుగుల సమీకరణం రాజస్తాన్‌కు విజయాన్ని ఖాయం చేసింది. 6 బంతుల్లో పరుగు అవసరమైన చోట 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్‌ సిక్సర్‌తో సెంచరీని, మ్యాచ్‌ను ఒకేసారి పూర్తి చేశాడు.  

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 113; డుప్లెసిస్‌ (సి) బట్లర్‌ (బి) చహల్‌ 44; మ్యాక్స్‌వెల్‌ (బి) బర్గర్‌ 1; సౌరవ్‌ (సి) జైస్వాల్‌ (బి) చహల్‌ 9; గ్రీన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–125, 2–128, 3–155. బౌలింగ్‌: బౌల్ట్‌ 3–0–30–0, బర్గర్‌ 4–0–33–1, అశ్విన్ 4–0–28–0, అవేశ్‌ఖాన్‌ 4–0–46–0, చహల్‌ 4–0–34–2, పరాగ్‌ 1–0–10–0. 

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) టాప్లీ 0; బట్లర్‌ నాటౌట్‌ 100; సామ్సన్‌ (సి) యశ్‌ (బి) సిరాజ్‌ 69; పరాగ్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ 4; జురెల్‌ (సి) కార్తీక్‌ (బి) టాప్లీ 2; హెట్‌మైర్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 3;  మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–148, 3–155, 4–164. 
బౌలింగ్‌: టాప్లీ 4–0–27–2, యశ్‌ దయాళ్‌ 4–0–37–1, సిరాజ్‌ 4–0–35–1, మయాంక్‌ 2–0–34–0, గ్రీన్‌ 3.1–0–27–0, హిమాన్షు 2–0–29–0.  

ఐపీఎల్‌లో నేడు
ముంబై X  ఢిల్లీ
వేదిక: ముంబై

మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి 
లక్నో X  గుజరాత్‌
వేదిక: లక్నో

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
 
Advertisement