IPL 2022: ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కేది ఎవరికి?

IPL 2022 Playoffs Scenario: What All 10 Franchises Need To Do Qualify - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముగింపుకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే సీజన్‌లో పది జట్లు కనీసం 9 లేదా 10 మ్యాచ్‌లు ఆడాయి. పోటీలో 10 జట్లు ఉన్నప్పటికి.. ఆఖరికి ప్లే ఆఫ్స్‌ చేరేది నాలుగు జట్లు మాత్రమే. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి.. మిగతా ఎనిమిదింటిలో ఓడి ప్లేఆఫ్‌ రేసు నుంచి ఎలిమినేట్‌ అయింది. ఇక సీఎస్‌కే కూడా 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. సీఎస్‌కే కూడా దాదాపు ప్లేఆఫ్‌ అవకాశాలు కోల్పోయినట్లే. మిగిలిన జట్ల పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం.

గుజరాత్‌ టైటాన్స్‌:
టాప్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్త్‌ దాదాపు ఖరారు చేసుకుంది. 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. రెండు ఓటములతో 16 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌.. తాను ఆడే నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా చాలు దర్ఝాగా ప్లేఆఫ్‌ చేరుతుంది. 

లక్నో సూపర్‌జెయింట్స్‌: 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. మూడు ఓటములతో 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో ప్లే ఆఫ్‌ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే చాలు.. అయితే రెండు అంతకంటే ఎక్కువ గెలిస్తే తొలి రెండు స్థానాల్లోనే ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉంటుంది. తొలి ప్లేఆఫ్‌లో ఓడినప్పటికి ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ద్వారా రెండో ప్లే ఆఫ్‌ ఆడే అవకాశం ఉంటుంది.

రాజస్తాన్‌ రాయల్స్‌:
రాజస్తాన్‌ రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.  లక్నో ప్లే ఆఫ్‌ చేరాలంటే కచ్చితంగా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు:
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. ఐదు ఓటములతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ చేరాలంటే నాలుగు మ్యాచ్‌ల్లో  2 మ్యాచ్‌లు గెలవాల్సిందే. 

ఎస్‌ఆర్‌హెచ్‌:
ఎస్‌ఆర్‌హెచ్‌ 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. 4 ఓటములతో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌లో చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే. 

పంజాబ్‌ కింగ్స్‌:
పంజాబ్‌ కింగ్స్‌ 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌ చేరాలంటే నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు గెలవాల్సి ఉంది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌:
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 9 మ్యాచ్‌లో నాలుగు విజయాలు, ఐదు ఓటములతో 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలవాల్సిందే.

కేకేఆర్‌:
కేకేఆర్‌కు ప్లేఆఫ్‌ అవకాశాలు చాలా తక్కువ. 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఆరు ఓటములతో 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా అన్నీ గెలవాల్సిందే. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top