ధోని ప్లాన్‌ వర్కవుట్‌ అయి ఉంటే, చెన్నైదే విజయం!

IPL 2021:Ms Dhoni Trying To Stump Dhawan Beamer From Moeen Ali - Sakshi

ముంబై: ఐపీఎల్‌ 2021 లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యం కళ్లముందున్నా ఎక్కడా తొందరపాటు లేకుండా ఢిల్లీ జట్టు‌ ఓపెనర్లు ధవన్, పృథ్వీ షా స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో 189 పరుగుల లక్ష్యాన్ని పంత్‌ సేన సునాయాసంగా ఛేదించింది. అయితే, మాంచి ఊపుమీదున్న ధవన్‌ను ఔట్‌ చేసేందుకు ధోని వేసిన ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు. సామ్‌‌ కరాన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ధవన్‌ సిక్స్, ఫోర్‌ కొట్టి జోరు కొనసాగిసున్నాడు. వికెట్ పడితే తప్ప మ్యాచ్‌పై‌ పట్టు రాదని భావించిన ధోని స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ధవన్‌ను వెనక్కి పంపేందుకు ఓ చక్కటి పథకం రచించాడు.  

ధవన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా బంతిని స్టంప్స్‌కు దూరంగా.. అంటే వైడ్ దిశగా వేయాలని బౌలర్‌కు సూచించాడు. ఈ క్రమంలో అనుకున్నట్లే ధవన్ బంతిని బౌండరీని తరలించేందుకు ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. బంతి కాస్తా ధవన్‌ను దాటిపోయి నేరుగా ధోని చేతుల్లో పడింది. సమయం కోసం వేచి చూస్తున్న చెన్నై సారథి బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంప్‌ అవుట్ చేశాడు. కానీ చెన్నైని దురదృష్టం వెంటాడింది.

ఎందుకంటే ధోని చెప్పినట్టుగా అలీ బంతిని వేయలేదు. వైడ్‌ బదులు బ్యాట్స్‌మెన్‌ మీదుగా బౌన్స్‌ బాల్‌ వేశాడు. దీంతో అంపైర్‌ దానిని నో బాల్‌గా ప్రకటించాడు. ధవన్‌ బతికిపోయాడు. ఇక ధోని ట్రిక్‌ ఫెయిల్‌ కావడంపై అభిమానులు ట్విటర్‌లో స్పందించారు. అలీ మంచి చాన్స్‌ మిస్‌ చేశాడు. పాపం ధోని అని కొందరు, ధవన్‌ కనుక ఔట్‌ అయి ఉంటే ఢిల్లీ పరిస్థితి మరోలా ఉండేది, చెన్నైనే విజయం వరించేది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ధోని ట్రిక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
( చదవండి: ఐపీఎల్‌లో ధోని డకౌట్‌లు ఇవే..! ) 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top