ఐపీఎల్‌లో ధోని డకౌట్‌లు ఇవే..!

IPL 2021: CSK Captain MS Dhoni Ducks In IPL - Sakshi

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌ను సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని డకౌట్‌తో ఆరంభించాడు. ఢిల్లీ  క్యాపిటల్స్‌తో  శనివారం(ఏప్రిల్‌10) జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు శుభారంభం లభించలేదు. డుప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో  7 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆపై రుతురాజ్‌ గైక్వాడ్‌(5) కూడా పెవిలియన్‌ చేగా, మొయిన్‌ అలీ(36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని మెరుపులు మెరిపించి పెవిలియన్‌ చేరాడు.

అటు తర్వాత సురేశ్‌ రైనా(54; 36 బంతుల్లో 3 ఫోర్లు ,4సిక్స్‌లు), అంబటి రాయుడు(23; 16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ స్పల్ప వ్యవధిలో ఔటైన తర్వాత సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత ధోనిపై పడింది. కానీ ధోని విఫలమయ్యాడు. అది కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

ఐపీఎల్‌లో ధోని డకౌట్‌లు.. ఆరేళ్ల తర్వాత మళ్లీ!
ఐపీఎల్‌లో ధోని నాలుగుసార్లు డకౌట్‌ అయ్యాడు. 2010 ఐపీఎల్‌ సీజన్‌లో రెండు సార్లు ధోని డకౌట్‌గా నిష్క్రమించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ధోని డకౌట్‌ కాగా, అదే స్టేడియంలో అదే ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని డకౌట్‌ అయ్యాడు. ఇందులో రాజస్తాన్‌ రాయల్స్‌తో గోల్డెన్‌ డక్‌(ఆడిన తొలి బంతికే)గా ఔట్‌ కాగా, డేర్‌డెవిల్స్‌పై రెండు బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. ఇక 2015లో ముంబై ఇండియన్స్‌తో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ధోని గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆరేళ్లకు మళ్లీ ధోని డకౌట్‌ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ధోని రెండో బంతికి ఔటయ్యాడు. అవిశ్‌ ఖాన్‌ వేసిన 16 ఓవర్‌ మూడో బంతికి ధోని బౌల్డ్‌ అయ్యాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top