ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌లో ముంబైదే పైచేయి

IPL 2021: Mumbai Indians vs Royal Challengers Bangalore Head To Head Match Stats - Sakshi

చెన్నై: యావత్‌ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ సీజన్‌ రానే వచ్చింది. కరోనా నేపథ్యంలో గతేడాది దుబాయ్‌కి తరలిపోయిన ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. ఈ ఏడాది భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. రేపు (ఏప్రిల్‌ 9న) డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఘనంగా ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆటగాళ్లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌ వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు రెండు జట్లు 27 సందర్భాల్లో ఎదురుపడగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైదే పైచేయిగా నిలిచింది. నెక్‌ టు నెక్‌ ఫైట్‌లో ముంబై 17సార్లు గెలుపొందగా, ఆర్‌సీబీ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఒక మ్యాచ్‌ టై(2020) కాగా, సూపర్‌ ఓవర్‌ ద్వారా ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. దీంతో ఆర్‌సీబీ విజయాల సంఖ్య 10కి చేరింది. టైటిల్‌ల పరంగా చూస్తే ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 5 సార్లు విజేతగా నిలువగా, బెంగళూరు జట్టు బోణీ కూడా కొట్టలేకపోయింది.

రోహిత్‌ సారధ్యంలో ముంబై వరుసగా రెండు టైటిల్‌లు(2019, 2020) నెగ్గి హ్యాట్రిక్‌ టైటిల్‌లపై కన్నేయగా, కోహ్లి నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తూ, హాట్‌ ఫేవరేట్‌గా నిలిచింది. ఆయా జట్ల బలాబలాలను విషయానికొస్తే.. స్వదేశీ, విదేశీ స్టార్ల కలయికతో ఇరు జట్లు సమిష్టిగా కనిపిస్తున్నాయి. ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా దేవదత్ పడిక్కల్, కెప్టెన్‌ కోహ్లిలు వచ్చే అవకాశం ఉంది. వన్‌ డౌన్‌లో మహ్మద్ అజారుద్దీన్, సెకెండ్‌ డౌన్‌లో ఏబీ డివిలియర్స్, ఆతరువాత గ్లెన్ మ్యాక్స్‌వెల్, డానియల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్లతో ఆర్‌సీబీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తుంది.

బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ లేదా రజత్ పటిదార్‌ లేదా సచిన్ బేబీలకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ముంబై విషయానికొస్తే.. బ్యాటింగ్‌లో రోహిత్‌, క్రిస్‌ లిన్‌, ఇషాన్‌ కిషన్‌, డికాక్‌, సూర్యకుమార్‌, పోలార్డ్‌, పాండ్యా బ్రదర్స్‌తో ఆ జట్టు అత్యుత్తమంగా కనిపిస్తుంది. బౌలింగ్‌ విభాగంలో బౌల్ట్‌, బుమ్రా, నాథన్ కౌల్టర్‌ నైల్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, పియూష్‌ చావ్లా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లతో ఆ జట్టు దృఢంగా కనిపిస్తుంది.
చదవండి: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో టీమిండియా పేసర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top