ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో టీమిండియా పేసర్‌

 Bhuvneshwar Kumar Nominated For ICC Player Of The Month For March - Sakshi

దుబాయ్‌: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో భారత్‌ తరఫున సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, జింబాబ్వే తరఫున సీన్‌ విలియమ్స్‌, అఫ్గనిస్థాన్‌ నుంచి రషీద్‌ ఖాన్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు, ఐదు టీ20ల సిరీస్‌లో 6.38 ఎకానమీతో 4 వికెట్లు సాధించాడు.

వికెట్ల పరంగా భువీ కాస్త వెనుకపడినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమయ్యాడు. స్లాగ్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్ఘన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లు, 3 టీ20ల సిరీస్‌లో 6 వికెట్లు సాధించి, భువీకి ప్రధాన పోటీదారుడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సీన్‌ విలియమ్స్‌ 264 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. అదే జట్టుతో జరిగిన 3 టీ20ల సిరీస్‌లో అతను 128.57 స్ట్రయిక్‌ రేట్‌తో 45 పరుగులు సాధించాడు.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ మహిళల విభాగంలో ఇద్దరు భారత అమ్మాయిల(రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ రౌత్‌)తోపాటు సౌతాఫ్రికా లిజెల్‌ లీ నామినేట్‌ అయ్యారు. కాగా, ఐసీసీ ఈ అవార్డులను ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తుంది. పురుషుల విభాగంలో తొలి అవార్డు రిషబ్‌ పంత్‌(జనవరి) దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు గాను అశ్విన్‌ కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో జనవరి నెలకు షబ్నిమ్‌ ఇస్మాయిల్‌(దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి నెలకు ట్యామి బీమౌంట్‌(ఇంగ్లండ్‌) ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.
చదవండి: ముంబై ఇండియన్స్‌ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top