నేపాల్‌లో మార్చి 5న ఎన్నికలు  | Nepal President Ramchandra Paudel announces Parliament Elections on 5 march 2026 | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో మార్చి 5న ఎన్నికలు 

Sep 14 2025 5:46 AM | Updated on Sep 14 2025 5:46 AM

Nepal President Ramchandra Paudel announces Parliament Elections on 5 march 2026

ఎన్నికలకు అందరూ సహకరించాలి 

విపక్ష పార్టీలు, విద్యార్థులు సహా పౌరులందరికీ దేశాధ్యక్షుడు పౌడెల్‌ వినతి

కాఠ్మండు: సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతి, వారసత్వరాజకీయాలతో పెల్లుబికిన ప్రజాగ్రహం ధాటికి దగ్దమైన పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులపర్వం పరిసమాప్తి తర్వాత ఎట్టకేలకు పూర్తికాల ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులుపడ్డాయి. వచ్చే ఏడాది మార్చి నెల ఐదో తేదీన పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ శనివారం ప్రకటన చేశారు. 

‘‘ దేశం అత్యంత క్లిష్టమైన, భయానక దశను చవిచూసింది. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థలే మనల్ని కాపాడాయి. సమైక్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ముందుకు సాగుదాం. ఆరు నెలల్లోపు పార్లమెంట్‌ దిగువసభకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుని ప్రగతిశీల ప్రజాస్వామ్య పథంలో పయనించే అవకాశాన్ని ప్రజలకు కలి్పస్తున్నాం. సుస్థిరపాలనే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం మార్చి ఐదో తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి.

 విపక్ష పార్టీలు మొదలు విద్యారి్థలోకం, పౌరసమాజం అంతా ఈ ఎన్నికల క్రతువుకు తమ వంతు సాయం అందించాలి’’ అని శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో అధ్యక్షుడు పౌడెల్‌ కోరారు. శుక్రవారం దేశ తాత్కాలిక మహిళా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే సుశీల కర్కీ చేసిన సిఫార్సు మేరకు పార్లమెంట్‌ను రద్దుచేశారు. అవినీతి మురికికూపంలో పొర్లాడుతున్న ప్రభుత్వంపై విద్యార్థుల్లో గూడుకట్టుకున్న ఆగ్రహం.. హఠాత్తుగా సోషల్‌మీడియా యాప్‌ల నిషేధంతో కట్టలుతెంచుకున్న విషయం విదితమే.  

24 శాఖలు ఆమె వద్దే 
ఆదివారం ప్రధా«ని కర్కీ తన తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేశాక దేశవ్యాప్తంగా తాజా శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె సమీక్ష జరిపే వీలుంది. పలువురు మంత్రులతో ఆమె దేశ, విదేశాంగ విధానాలపై చర్చించే అవకాశముంది. హోం శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ వంటి కీలక 24 శాఖలను ఆమె తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. 

కాఠ్మండులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలుండే సింగ్‌దర్బార్‌ కాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మించిన హోం మంత్రిత్వ శాఖ భవనాన్ని ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయంగా మార్చనున్నారు. ప్రధాని కార్యాలయాన్ని ఇటీవల ఆందోళనల్లో విద్యార్థి నిరసనకారులు తగలబెట్టడంతో కొత్త భవనంలోకి ఆఫీస్‌ను మార్చాల్సి వస్తోంది. మరోవైపు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. కాఠ్మండులోని బనేశ్వర్‌లోని పౌర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులతో ఆమె స్వయంగా మాట్లాడారు. 

తగు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్‌ ప్రస్తుత కాలపరిమితిని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలన్న అధ్యక్షుడు నిర్ణయాన్ని ప్రధాన రాజకీయపార్టీలన్నీ తప్పుబట్టాయి. నేపాల్‌కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌(యునిఫైడ్‌ మార్కిస్ట్‌ లెనినిస్ట్‌), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌(మావోయిస్ట్‌ సెంటర్‌)లు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాజ్యాంగ విరుద్ధంగా కాలావధిని కాలరాయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నాయి. ఈ మేరకు దిగువసభలోని పార్టీల చీఫ్‌ విప్‌లు ఒక సంయుక్త ప్రకటనను విడుదలచేశాయి. దేశాధ్యక్షుడి చర్యలను తప్పుబట్టాయి.

జస్టిస్‌ సుశీలకు మోదీ అభినందనలు
 ఇంఫాల్‌: నేపాల్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ సుశీల కరీ్కకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అభినందనలు తెలియజేశారు. ఆమె నియామకం మహిళా సాధికారతకు ఉజ్వలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. మోదీ శనివారం మణిపూర్‌ సభలో మాట్లాడుతూ.. భారత్‌–నేపాల్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరుదేశాలు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతి సంబంధాలను పంచుకుంటున్నాయని వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement