ఐపీఎల్ ముగిసిన తర్వాత దేశానికి రానివ్వరని.. అందుకే

IPL 2021: KKR mentor David Hussey Reveals Australian Players Nervous - Sakshi

ముంబై: భారత్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ విదేశీ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతున్నారు. రాజస్తాన్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ తాను బయోబుల్‌లో ఉండలేనంటూ ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోగా..  తాజాగా రాజస్తాన్‌కే చెందిన మరో ఆటగాడు ఆండ్రూ టైతో పాటు ఆర్‌సీబీ ఆటగాళ్లు ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌లు కూడా ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ మెంటార్‌.. మాజీ ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ హస్సీ స్పందించాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కరోనా పేరుతో దేశానికి రానివ్వనేమోరన్న ఆందోళన ఆటగాళ్లలో ఎక్కువైపోయిందని.. అందుకే అర్థంతరంగా ఐపీఎల్‌ వీడుతున్నారని తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ..''ఆసీస్‌కు చెందిన చాలామంది ఆటగాళ్లు ఈసారి ఐపీఎల్‌లో ఆడుతున్నారు. స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌, కౌల్టర్‌ నీల్‌ ఇలా ఎక్కువ మొత్తంలో ఆసీస్‌ ఆటగాళ్లు ఉన్నారని.. వారు కూడా భయంతోనే ఉన్నారు. నిజానికి ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే. తిరిగి ఆస్ట్రేలియా వెళ్తామా లేదా అన్న సందేహం వాళ్లకు ఉంది. వీళ్లే కాదు మ‌రికొంద‌రు ప్లేయ‌ర్స్ ప‌రిస్థితి కూడా ఇదే. మేము బ‌యో బ‌బుల్స్‌లోనే ఉంటున్నాం. ప్ర‌తి రెండో రోజు క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తారు. నిజానికి అంతా బాగానే చూసుకుంటున్నారు.

కానీ ఇండియాలో ప‌రిస్థితి ఎలా ఉందో రోజూ టీవీల్లో చూస్తున్నాం. హాస్పిట‌ల్ బెడ్స్‌పై పేషెంట్ల‌ను చూస్తున్నాం. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ మ‌నం ఇలా ఆడుతూ, అభిమానుల‌కు వినోదాన్ని పంచుతున్నామంటే మేము ఎంత అదృష్ట‌వంతుల‌మో అని మేము నిన్న‌నే మాట్లాడుకున్నాం. కొవిడ్ భ‌యం అంద‌రికీ ఉన్నా.. టోర్నీ కొన‌సాగాల‌నే అనుకుంటున్న‌ట్లు'' చెప్పాడు. ఇక కేకేఆర్‌ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలిచి నాలుగు పరాజయాలు చవిచూసింది. కాగా నేడు పంజాబ్‌ కింగ్స్‌తో అహ్మదాబాద్‌ వేదికగా అమితుమీ తేల్చుకోనుంది.
చదవండి: ఐపీఎల్‌కు కరోనా ఎసరు.. గుడ్‌బై చెబుతున్న ఆటగాళ్లు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top