భారత్‌లోని అత్యుత్తమ ఫీల్డర్‌ తను: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

IPL 2021 CSK Deepak Chahar Says Want 11 Jaddus - Sakshi

ముంబై: ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తనూ ఒకడు. నా బౌలింగ్‌లో ఎన్నో క్యాచ్‌లు అందుకున్నాడు. నాకైతే మైదానంలో 11 మంది జడ్డూలు ఉంటే బాగుండు అనిపిస్తుంది’’ అంటూ చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ సహచర ఆటగాడు రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్‌ స్థానంలో గనుక జడ్డూ భాయ్‌ ఉంటే, తొలి ఓవర్‌లోనే గేల్‌ వికెట్‌ లభించేదని అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీపక్‌ చహర్‌ తమ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్‌ చహర్‌ (4/13)కు ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ అవార్డు లభించింది.

అయితే, ఈ మ్యాచ్‌లో చహర్‌ వికెట్లతో రాణిస్తే రవీంద్ర జడేజా తన మెరుపులాంటి ఫీల్డింగ్‌ విన్యాసాలతో క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా మూడో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ను రనౌట్‌ చేసిన విధానం, ఆ తర్వాత చహర్‌ బౌలింగ్‌(ఐదో ఓవర్‌)లో క్రిస్‌ గేల్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించడం పట్ల ఫిదా అవుతున్నారు. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను అవుట్‌ చేయడంలో జడ్డూ ప్రధాన పాత్ర పోషించడంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చహర్‌ మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించాడు. కాగా తొలి ఓవర్‌లో చహర్‌ వేసిన బంతిని గేల్‌ షాట్‌ ఆడగా, గాల్లోకి లేచిన బంతిని రుతురాజ్‌ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం..‘‘ ఇండియాలోని అత్యుత్తమ ఫీల్డర్‌ తను. ఇదే నిజం’’ అంటూ రవీంద్ర జడేజాను ఆకాశానికెత్తాడు.

చదవండి: సూపర్‌ జడ్డూ.. ఇటు రనౌట్‌.. అటు స్టన్నింగ్‌ క్యాచ్‌
అదరగొట్టిన చహర్‌: 4–1–13–4

స్కోర్లు: పంజాబ్‌ కింగ్స్‌ 106/8 (20)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ 107/4 (15.4)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top