MS Dhoni: ఈ సీజన్‌ తర్వాత రిటైర్మెంట్‌.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే!

IPL 2021: Brad Hogg Feels CSK Skipper MS Dhoni Going To Retire - Sakshi

ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ వ్యాఖ్యలు

Brad Hogg Comments On MS Dhoni: చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ఈ సీజన్‌ ముగిసిన తర్వాత రిటైర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. గత కొంత కాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడని, వయసు మీద పడుతున్న దృష్ట్యా ఇక ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని సూచించాడు. కాగా ఐపీఎల్‌-2020లో ఘోరంగా విఫలమైన చెన్నై... తాజా సీజన్‌లో మాత్రం అదరగొడుతోంది. ముఖ్యంగా రెండో అంచెలో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

అయితే, కెప్టెన్‌గా సీఎస్‌కేకు విజయాలు అందిస్తున్నా.. బ్యాటర్‌ మాత్రం ధోని పెద్దగా రాణించలేకపోతున్నాడు. తొలి దశలో బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకపోగా.. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించినా.. మిస్టర్‌ కూల్‌ పూర్తిగా నిరాశపరిచాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని(1) బౌల్డ్‌ అయ్యాడు. గతంలో కూడా ఇదే తరహాలో వరుణ్‌ బౌలింగ్‌లో వికెట్‌ సమర్పించుకున్న ధోని.. మరోసారి అదే తప్పిదాన్ని పునరావృతం చేశాడు. 


బ్రాడ్‌ హాగ్‌

వయసు మీద పడుతోంది కదా!
ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాగ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనుకుంటున్నా. చక్రవర్తి బౌలింగ్‌లో ధోని అవుట్‌ అయిన విధానం చూశాం. 40 ఏళ్ల ధోని అలసిపోతున్నాడేమో. ఏదేమైనా కెప్టెన్‌గా అతడు సాధించే విజయాలు ఇటు సీఎస్‌కేతో పాటు భారత క్రికెట్‌ మొత్తానికి కూడా ఉపయుక్తంగా ఉంటాయనడంలో సందేహం లేదు. జడేజా వంటి ఎంతో మంది ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చాడు. అయితే, వయసు మీద పడుతున్న కొద్దీ తను వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు అనిపిస్తోంది. రిటైర్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించాడు.

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ లేదంటే... 
ఒకవేళ ధోని సీఎస్‌కే(ఆట‌)కు వీడ్కోలు పలికితే.. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. ‘‘రాబోయే టీ20 వరల్డ్‌కప్‌నకు తను మెంటార్‌గా ఉండబోతున్నాడు. ఒకవేళ ఐపీఎల్‌లో ఆటకు గుడ్‌బై చెబితే సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా లేదంటే.. యాజమాన్యంలో కీలక సభ్యుడిగా మారే ఛాన్స్‌ ఉంది. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో కలిసి వ్యూహాలు రచిస్తూ.. సరికొత్త సీఎస్‌కే ప్రయాణానికి బలమైన పునాదులు వేసేందుకు ఇది ఉపకరిస్తుంది’’ అని బ్రాడ్‌ హగ్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో.. ధోని గనుక రిటైర్‌ అయితే.. అతడి స్థానంలో ‘మ్యాచ్‌ ఫినిషర్‌’ రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తవవుతున్నాయి.

చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top