‘కుంబ్లే చూస్తున్నాడు, నీకు మామూలుగా ఉండదు’

IPL 2020: Glenn Maxwell Poor Performance Fans Trolling - Sakshi

ఏంటి సామీ ఇది.. రెండేళ్లుగా ఒక్క సిక్స్‌ కూడా..

దుబాయ్‌: ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ జట్టు మూడు విజయాలు మాత్రమే సాధించింది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సీనియర్‌ ఆటగాడు గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ నుంచి ఒక్క గొప్ప ప్రదర్శన కూడా కానరాలేదు. ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న అతని ఆటతీరుపై జట్టు ఫ్రాంచైజీ భావన ఎలా ఉందో తెలియదు గానీ, పంజాబ్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 9 మ్యాచ్‌లలో మ్యాక్సీ 58 పరుగులు మాత్రమే చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్‌లో ఫరవాలేదనిపిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌ బ్యాటింగ్‌లో ఇంత దారుణంగా విఫలమవడం జట్టును కష్టాల్లోకి నెడుతుందని అంటున్నారు.

నిన్న ముంబైతో మ్యాచ్‌లోనూ రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే మ్యాక్సీ వెనుదిరడంతో భారమంతా కెప్టెన్‌ రాహుల్‌పై పడింది. పంజాబ్‌ కూడా సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో.. రెండో సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌ సహకారం ఉండి ఉంటే పంజాబ్‌ అలవోక విజయం సాధించేది. ఈనేపథ్యంలో ‘11 కోట్లు పెట్టి చీర్‌ లీడర్‌ని కొన్నట్టుగా మ్యాక్స్‌వెల్‌ ఆటతీరు ఉంది’ అని కొందరు, ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ కుంట్లే రెడీగా ఉన్నాడు. నీకు మామూలుగా ఉండదు’అని మరికొందరు అభిమానులు మీమ్స్‌తో మ్యాక్సీని ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా, గత కొన్ని సీజన్లలోనూ పెద్దగా రాణించని మ్యాక్సీని పంజాబ్‌ ఫ్రాంచైజీ ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక యూఏఈలో 2014 జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించిన మ్యాక్సీ పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 5 మ్యాచ్‌లలోనే 300 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ మ్యాచ్‌లో.. ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై సిక్సర్‌ బాదిన మ్యాక్స్‌వెల్‌.. ఇంతవరకు ఒక్క సిక్స్‌ కూడా కొట్టకపోవడం గమనార్హం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top