
దుబాయ్: ఐపీఎల్ ప్రధాన టోర్నీకి ముందే మైదానంలో ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉంటే బాగుంటుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందు కోసం అన్ని జట్ల మధ్య వామప్ మ్యాచ్‌లు ఏర్పాట్లు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాయి. సాధారణంగా ప్రతీ టీమ్ తమ జట్టులోని ఆటగాళ్లనే రెండు బృందాలుగా చేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతూ ఉంటాయి. అయితే దీనికంటే ఇతర టీమ్‌లతో తలపడితే సరైన సాధన చేసినట్లు వారు భావిస్తున్నారు. కరోనా కారణంగా మార్చినుంచి క్రికెట్ ఆగిపోయింది. ఎవ్వరూ కూడా పోటీ క్రికెట్‌లో తలపడలేదు.
అందుకే అసలు సమరానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు తమకు సన్నాహకంగా పనికొస్తాయని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై బోర్డునుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు దీనిపై భిన్నంగా స్పందించారు. ‘మాకు ఇప్పటికే అవసరానికి మించిన బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మేం ఎక్కడ పెట్టుకుంటాం. నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే ఫ్రాంచైజీ యజమానులు వారిలో వారు మాట్లాడుకొని తేల్చుకుంటే మంచిది. అందరికీ ఆసక్తి ఉండి ఆడుకుంటామంటే ఎవరు వద్దంటారు’ అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభం కానుంది.