ఐపీఎల్‌ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!

IPL 2020 Arun Dhumal Says BCCI Earned Rs 4000 Crore 13th Season - Sakshi

బీసీసీఐకి రూ. 4 వేల కోట్ల ఆదాయం: బోర్డు కోశాధికారి

న్యూఢిల్లీ: క్యాష్‌‌ రిచ్‌ ఈవెంట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కరోనా కాలంలోనూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్‌-13వ సీజన్‌కు గానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్‌షిప్‌ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్‌ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్‌-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.(చదవండి: కోహ్లి త్వరలోనే ఆ ఘనత సాధిస్తాడు: భజ్జీ)

ఆ తర్వాత జూన్‌-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్‌ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జించాం. డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్‌షిప్‌ 25 శాతం వరకు పెరిగింది. తొలుత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు. ఒకవేళ ఈ సీజన్‌ నిర్వహించకపోయి ఉంటే క్రికెటర్లు ఓ ఏడాది కాలాన్ని కోల్పేయేవారు’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: యూఏఈకి బీసీసీఐ బంపర్‌ బొనాంజ!)

ఇక కోవిడ్‌ కాలంలో టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ.. ‘‘ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్‌ కోసం సుమారు 200 గదులు బుక్‌ చేశాం’’ అని అరుణ్‌ ధుమల్‌ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌-13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్‌ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్‌ సేన చరిత్ర సృష్టించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top